అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sanathnagar TIMS Hospital Launch | సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది రోజున ఈ హాస్పిటల్‌ను ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) తెలిపారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం టిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తోంది. సనత్‌నగర్ టిమ్స్‌పై గురువారం మంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి ప్రారంభంలోగా సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి, హాస్పిటల్‌ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
Sanathnagar TIMS Hospital Launch | తుది దశకు..
సనత్ నగర్ టిమ్స్‌ను వెయ్యి పడకల సామర్థ్యంలో నిర్మించారు. ఓపీ రూమ్‌లు, డయాగ్నస్టిక్స్, ఇన్‌పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. టిమ్స్‌లో వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు వివరించారు. హాస్పిటల్లో 16 ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీటీ స్కాన్ (CT Scan), ఎంఆర్ఐ (MRI), డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ సైతం పూర్తయినట్లు తెలిపారు. హాస్పిటల్ ప్రారంభమయ్యే నాటికి టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
Sanathnagar TIMS Hospital Launch | నాన్ మెడికల్ సర్వీసెస్‌పై..
హాస్పిటల్ నిర్వహణకు అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియపై మంత్రి రాజనర్సింహ ఆరా తీశారు. పూర్తిగా కొత్త హాస్పిటల్ అయినందున.. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను సనత్‌నగర్ టిమ్స్‌లో వినియోగించుకోవాలని సూచించారు. పారిశుధ్యం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోగులకు ఓపీ (OP) రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్ఎంఐఎస్ (e-HMIS) సాఫ్ట్వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలన్నారు. రోగులకు, సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.