అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samantha | ఇటీవల లులు మాల్లో ‘ది రాజా సాబ్’ సినిమా పాట విడుదల సందర్భంగా నటి నిధి అగర్వాల్ ఎదుర్కొన్న చేదు అనుభవం మరువకముందే, ఇప్పుడు అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభుకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో అభిమానుల అత్యుత్సాహం సమంతకు ఇబ్బందిగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. దాంతో అభిమానుల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Samantha | ఇలా ఉన్నారేంట్రా..
అసలేం జరిగిందంటే.. నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ ప్రాంతంలో సిరిమల్లె శారీస్ (Sirimalle Sarees) కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమెను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమం సజావుగా పూర్తైనప్పటికీ, కార్యక్రమం ముగిసిన తర్వాత సమంత బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సమంతను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమె చుట్టూ గుమిగూడి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆమెను దగ్గర నుంచి చూడాలనే ఉత్సాహంలో హద్దులు దాటి ప్రవర్తించడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో సమంతకు కారు వరకు చేరుకోవడమే కష్టంగా మారింది.
ఈ పరిస్థితిని గమనించిన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అభిమానుల గుంపు మధ్య నుంచి అతికష్టం మీద సమంతను బయటకు తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానమంటే గౌరవం ఉండాలే తప్ప, సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతను విస్మరించడం సరికాదని విమర్శిస్తున్నారు. వరుసగా నిధి అగర్వాల్, ఇప్పుడు సమంతకు ఇలాంటి అనుభవాలు ఎదురవడంతో, భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు అవసరమని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.