అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vemulawada | వేములవాడ (Vemulawada)లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణకు మోక్షం లభించనుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి (Rajarajeshwara Swamy) దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నా.. వసతులు మాత్రం పెరగక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని రోడ్లు ఇరుకుగా ఉండటంతో భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోడ్ల విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. తాజాగా అధికారులు శుక్రవారం ఉదయం పలు భవనాలు కూల్చివేశారు.
Vemulawada | భవనాల కూల్చివేత
రోడ్ల విస్తరణ కోసం అధికారులు గతంలోనే చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న భవనాల తొలగింపు కోసం నోటీసులు కూడా జారీ చేశారు. కొంతమందికి పరిహారం కూడా మంజూరైంది. ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం మూలవాగుపై రెండో వంతెన నిర్మాణం కోసం తిప్పాపూర్ (Tippapur)లో భవనాలు కూల్చివేశారు. అయితే తమకు పరిహారం ఇవ్వకుండా భవనాలు కూలుస్తున్నారని స్థానికులు ఆందోళనలు చేపట్టారు. వారిని అక్కడి నుంచి పోలీసుల సాయంతో తొలగించి ఉద్రిక్తతల మధ్యే కూల్చివేతలు చేపట్టారు.
Vemulawada | కోర్టు స్టే ఎత్తేయడంతో..
రోడ్ల వెడల్పు కోసం గతంలో అధికారులు నోటీసులు ఇవ్వడంతో 80 మంది కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పుడు కోర్టు స్టే(Court Stay) ఇచ్చింది. దీంతో వారి నిర్మాణాలు మినహా మిగతా భవనాలను అధికారులు కూల్చివేశారు. నెల రోజులుగా రోడ్ల వెడల్పు పనుల ప్రక్రియను అధికారులు చేపట్టారు.
అయితే గురువారం భవనాల కూల్చివేతపై కోర్టు స్టే ఎత్తేసింది. దీంతో శుక్రవారం ఉదయం అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను తొలగించారు. భవనాల తొలగింపు ప్రక్రియ పూర్తయితే.. త్వరలోనే రోడ్ల వెడల్పు పనులు మొదలు పెట్టనున్నారు.