అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kerala Cricket League | ఈ మధ్య బౌలర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. టీ20 ఫార్మాట్ వచ్చాక బ్యాటర్స్ వెరైటీ షాట్స్ ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నారు.
కేరళ క్రికెట్ లీగ్‌లో (Kerala Cricket League ) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఓ బ్యాటర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 12 బంతుల్లో ఏకంగా 11 సిక్సర్లు కొట్టి వావ్ అనిపించాడు. మరి ఇంతకు ఆ విధ్వంసకర ఆటగాడు ఎవరో తెలుసా సల్మాన్ నిజార్. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Greenfield International Stadium) అదానీ త్రివేండ్రం రాయల్స్ vs కాలికట్ గ్లోబస్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు సల్మాన్ (Salman Nizar). టాస్ గెలిచిన అదానీ జట్టు, కాలికట్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
Kerala Cricket League | పరుగుల ప్రవాహం
ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన కాలికట్ జట్టు, ఆఖర్లో మాత్రం పరుగుల వర్షం కురిపించింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సల్మాన్ నిజార్ తొలి 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత గేర్ మార్చిన అతడు రెచ్చిపోయాడు. 26 బంతుల్లో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 12 సిక్సర్లు ఉన్నాయి.
Kerala Cricket League | ఒకే ఓవర్లో 40 పరుగులు
సల్మాన్ 19వ ఓవర్లో బాసిల్ థంపీ (Basil Thampi) బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. ఆరో బంతికి సింగిల్ తీశాడు. ఇక 20వ ఓవర్ చూస్తే.. అభిజిత్ ప్రవీణ్ బౌలింగ్‌లో ఒక్క ఓవర్లోనే 40 పరుగులు రాబట్టాడు. అందులో 6 సిక్సర్లు సల్మాన్ కొట్టగా, మిగిలిన 4 పరుగులు ఎక్స్‌ట్రాలుగా వచ్చాయి.
సల్మాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కాలికట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన అదానీ త్రివేండ్రం రాయల్స్ 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కాలికట్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. లీగ్‌లోనే కాదు, రంజీ ట్రోఫీలోనూ సల్మాన్ నిజార్ అద్భుత ఫార్మ్‌లో ఉన్నాడు. కేరళ (Kerala ) తరఫున ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ నిలిచాడు. ఆయన 86.71 యావరేజ్‌తో 607 పరుగులు సాధించాడు.