Homeక్రీడలుAsia Cup | రన్నరప్‌ చెక్కును విసిరేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా.. చిత్తుగా...

Asia Cup | రన్నరప్‌ చెక్కును విసిరేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా.. చిత్తుగా ఓడిన ఆ బ‌లుపు త‌గ్గ‌లే అంటున్న నెటిజ‌న్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తీవ్ర నిరాశతో ఆగ్రహావేశానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెజెంటేషన్ వేడుకలో రన్నరప్ చెక్కును అందుకున్న వెంటనే… ఆ చెక్కును నేలపై విసిరేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం(Dubai International Stadium)లో జరిగిన ఈ టైటిల్ పోరులో, పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లతో ఛేదించింది.తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో 69 పరుగులు (నాటౌట్) చేసి, విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్ (24), శివమ్ దూబే (33) తో చ‌క్క‌ని భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పి భార‌త్‌ని విజ‌య‌తీరాలకి చేర్చాడు.

Asia Cup | పాక్ కెప్టెన్ వైఖరిపై తీవ్ర విమర్శలు

అయితే మ్యాచ్ అనంతరం ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) ప్రతినిధి అమీన్ ఉల్ ఇస్లాం చేతులమీదుగా రన్నరప్ చెక్(Runnerup Check) అందుకున్న సల్మాన్ అఘా, దానిని అక్కడికక్కడే ఆగ్రహంతో నేలపై విసిరేయడం అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది.అతని చర్యపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్పోర్ట్స్‌మెన్‌షిప్‌కి విరుద్ధంగా సాగిన ఈ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ప్రెజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన సల్మాన్ అలీ అఘా(Salman Ali Agha) మాట్లాడుతూ ..ఈ ఓటమి మాకు చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మేము అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాం. స్ట్రైక్ రొటేట్ చేయడంలో, వికెట్లు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాం అని అన్నారు.

అయితే బౌలింగ్‌ను పొగిడిన అఘా, బౌలర్లు తమ వంతు ప్రయత్నం చేశారని, బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారని స్పష్టం చేశారు. “నేను కూడా కెప్టెన్‌గా నా బాధ్యత నెరవేర్చలేకపోయాను. కానీ ఇది మాకు ఒక గుణపాఠం. మేము త్వరలోనే బలంగా తిరిగివస్తాము అని చెప్పుకొచ్చాడు. ఈ ఆసియా కప్‌(Asia Cup)లో భారత్ చేతిలో పాకిస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఇప్పటికే లీగ్ స్టేజ్ మరియు సూపర్ ఫోర్‌లో భారత్ చేతిలో ఓడిన పాక్(Pakistan), ఫైనల్లోనూ చిత్తుగా ఓడి వారి అభిమానుల‌కి నిరాశ‌ని మిగిల్చింది. పాక్ జట్టులోని ఆటగాళ్ల ప్రతిభకు ఏ కొదవా లేకపోయినా, ఒత్తిడి సమయంలో నిలకడగా ఆడే నైపుణ్యంపై పునఃపరిశీలన అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. పైగా కెప్టెన్ స్థాయిలో కనిపించే ఈ తరహా ప్రవర్తన జట్టు మానసిక స్థితిని ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Must Read
Related News