అక్షరటుడే, హైదరాబాద్: Sadhula Bathukamma | బతుకమ్మ పండగ ప్రకృతిని, మహిళలను గౌరవించే ఒక గొప్ప పండగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ festival తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఈ పండుగ పూలతో దేవుడిని పూజించడం మాత్రమే కాదు.. పూలనే దేవతలా కొలుస్తారు. భాద్రపద అమావాస్యతో మొదలై, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ Bathukamma తో పండుగ ముగుస్తుంది.
ఈ తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మగా పూజించి, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. చివరి రోజున సద్దుల బతుకమ్మగా చేసుకుంటారు.
Sadhula Bathukamma | పండుగ విశేషాలు
బతుకమ్మ పండుగ పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఆనందాన్ని నింపుతుంది. తెల్లవారుజామునే పిల్లలు తమ భుజాలకు సంచులు వేసుకుని బయల్దేరుతారు.
కొండలు, పొలాల చుట్టూ తిరుగుతూ తంగేడు, గునుగు, సీత జడ, నంది వర్ధనం వంటి పూలను సేకరిస్తారు. ఆడపడుచులు ఆ పూలతో జాగ్రత్తగా, అందంగా బతుకమ్మను పేరుస్తారు.
కొత్త చీరలు ధరించి ముస్తాబై.. బతుకమ్మ చుట్టూ చేరి కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ గౌరమ్మను కీర్తిస్తారు. ఈ సంప్రదాయం అనేక ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు.. ప్రకృతితో మమేకమై జీవించే కళ.
Sadhula Bathukamma | ప్రకృతితో బతుకమ్మ బంధం
ఈ పండుగ వర్షాకాలం చివర, చలికాలం ప్రారంభంలో వస్తుంది. అప్పటికి కురిసిన వర్షాలతో చెరువులు నిండి వాటిలో బ్యాక్టీరియా, క్రిములు పెరుగుతాయి. బతుకమ్మకు వాడే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, రుద్రాక్ష వంటి పూలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
ఈ పూల సువాసన ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఈ పూలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల అవి నీటిలో కలిసి బ్యాక్టీరియాను, క్రిములను నశింపజేసి నీటిని శుద్ధి చేస్తాయని అంటారు. ఇది ప్రకృతిని కాపాడేందుకు చేసే ఒక అద్భుతమైన పండుగ.
ఐకమత్యానికి ప్రతీక
బతుకమ్మ పండుగ ఐకమత్యానికి ఒక గొప్ప ప్రతీక. పూలు సేకరించడం నుంచి బతుకమ్మ ఆడటం వరకు అందరూ కలిసి చేస్తారు. ఇది పిల్లల్లో, ఆడపడుచుల్లో ఐకమత్యాన్ని పెంచుతుంది.
ఇతర పండుగలు ఇళ్లలో నిర్వహించుకుంటే.. బతుకమ్మను మాత్రం అందరూ ఒకచోట చేరి జరుపుకొంటారు. కులాలకు అతీతంగా ప్రసాదాలు, వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ప్రజల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. ఒక సామాజిక వేడుక.
బతుకమ్మ పుట్టుక వెనుక పురాణ కథలు
నిజాం నవాబుల కాలం నాటి కథ: నవాబుల Nizam Nawabs కాలంలో భూస్వాముల ఆగడాలకు తాళలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట. ఆమెను గౌరవిస్తూ ఊరి ప్రజలు “బతుకమ్మా” అని కీర్తించారని అంటారు. భూస్వాముల ఆగడాలకు బలైపోయిన మహిళలను స్మరించుకుంటూ అప్పటి నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటారని ఒక కథనం.
ధర్మాంగదుడు, సత్యవతి దేవి కథ: దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన ధర్మాంగదుడు Dharmangadhu, అతని భార్య సత్యవతి దేవి Satyavati Devi కి చెందిన వంద మంది కుమారులు యుద్ధంలో చనిపోతారు.
తరువాత లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఒక కూతురు పుడుతుంది. ఆమె చిన్ననాటి నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవడంతో ఆమె పేరును “బతుకమ్మ”గా మార్చారట. అప్పటి నుంచి ఆమె పుట్టిన రోజును పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని మరో కథనం ప్రచారంలో ఉంది.