అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sachin Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో సందడి నెలకొంది. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో సచిన్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కోడలిగా రానున్న సానియా చాందోక్(Sania Chandok) కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకల ఫొటోలు శుక్రవారం సచిన్(Sachin Tendulkar) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, 8 గంటల వ్యవధిలోనే 2.6 లక్షలకుపైగా లైకులు దక్కాయి. ఫొటోలో సచిన్, భార్య అంజలితో పాటు అర్జున్, సారా, సానియా చాందోక్ సహా కుటుంబ సభ్యులంతా కనిపించారు. ఇదే సందర్భంగా సచిన్ తన తల్లికి ఉద్దేశించి భావోద్వేగభరితమైన సందేశం కూడా రాశారు.
Sachin Tendulkar | స్పెషల్ మూమెంట్..
“నీ గర్భంలో పుట్టాను కాబట్టే నేను ఒకడినయ్యాను. నువ్వు ఆశీర్వదించావు కాబట్టే ఎదుగుతూ వచ్చాను. నువ్వు బలంగా ఉన్నావు కాబట్టే మేమందరం బలంగా నిలబడ్డాం. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా!” అని ఆయన పేర్కొన్నారు.ఇక ఇటీవలే యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) మరియు సానియా చాందోక్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కుటుంబానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఆగస్ట్ 25న ఒక సోషల్ మీడియా లైవ్ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “అవును, అతనికి నిశ్చితార్థం జరిగింది. అతని జీవితంలో ఈ కొత్త దశ పట్ల మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం” అని సచిన్ స్వయంగా వెల్లడించారు.
సానియా చాందోక్, ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఘాయ్ కుటుంబానికి హాస్పిటాలిటీ & ఫుడ్ రంగాల్లో మంచి పేరు ఉంది. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి బ్రాండ్లు వీరికి చెందినవే. ఇక అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా ఆడుతున్న అర్జున్, బ్యాటింగ్‌లోనూ తన ప్రతిభను చాటుతూ తండ్రి అడుగుల్లో నడుస్తున్నాడు.