అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa Funds Delay | రైతు భరోసా కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. యాసంగి సీజన్ సగం గడిచినా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) రైతు భరోసా ఎకరాకు ప్రతి సీజన్లో రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. పంటల సాగు సమయంలో పెట్టుబడి కోసం వీటిని అందిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు రూ.4 వేలతో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. అనంతర రూ.5 వేలకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసీజన్లో రైతు బంధు రూ.5 వేల చొప్పున వేసింది. తర్వాత సీజన్లో రైతు బంధు జమ చేయలేదు. గత యాసంగి సీజన్లో రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు రూ.6 వేలు అందించడం ప్రారంభించింది. అయితే ప్రస్తుత సీజన్‌కు సంబంధించిన డబ్బులు ఇంకా జమకాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa Funds Delay | ఎన్నికలు పూర్తి
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల పలు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) పూర్తయ్యాక రైతు భరోసా జమ చేస్తామన్నారు. మరోవైపు ఆర్బీఐ నుంచి ప్రభుత్వం లోన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. కౌంటింగ్ వరకు ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉంటుంది. దీంతో కౌంటింగ్ అనంతరం రైతు భరోసా జమ చేస్తారా.. లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Rythu Bharosa Funds Delay | సాగు భూములకే..
రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో రూ.9 వేల కోట్లు విడుదల చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే అప్పుడు ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) కోసం త్వరగా నిధులు విడుదల చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కోర్టు కేసులతో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. యాసంగి సీజన్లో సాగు భూములకు మాత్రమే రైతు భరోసా విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. దీంతో నిధుల్లో కోత పడనుంది. పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు ఏడాదికి ఒకసారి మాత్రమే సాగు చేస్తారు. అలాగే యాసంగిలో నీటి వసతి లేని ప్రాంతాల్లో పంటలు వేయరు. దీంతో రైతు భరోసా నిధుల్లో భారీగా కోత పడనుంది.
Rythu Bharosa Funds Delay | అందరికి వేస్తారా..
కాంగ్రెస్ (Congress) అధకారంలోకి వచ్చాక తొలిసారి నాలుగు ఎకరాల్లో రైతులకు మాత్రమే రైతు భరోసా జమ చేశారు. ఒక సీజన్లో మొత్తానికే వేయలేదు. వానాకాలం సీజన్లో మాత్రమే అందరు రైతులకు నిధులు జమ చేశారు. దీంతో ఇప్పుడు కూడా రైతు భరోసా వేస్తారా.. లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేస్తే అందరికి వేస్తారా.. లేక ఎకరాల పరిమితి పెడతారా అని చర్చించుకుంటున్నారు.