అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa Delay | రాష్ట్ర ప్రభుత్వం (State Government) యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రివర్గ సమావేశంలో నిధుల విడుదలపై చర్చిస్తారని వార్తలు వచ్చినా.. దాని ఊసే ఎత్తలేదు. దీంతో ఈ సీజన్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తుందో లేదోనని రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో రైతుబంధు పథకం ప్రవేశ పెట్టారు. పంట పెట్టుబడి సాయం కింద మొదట ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేవారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు ప్రతి సీజన్లో రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. అయితే యాసంగి సీజన్‌కు సంబంధించిన డబ్బులు డిసెంబర్లో వేయాలి. కానీ ఫిబ్రవరి ముగుస్తున్నా రైతు భరోసా జమ చేయకపోవడం, అసలు నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ సారి ఎగ్గొడుతుందని రైతులు చర్చించుకుంటున్నారు.
Rythu Bharosa Delay | స్పందన కరువు
క్యాబినెట్ మీటింగ్ (Cabinet Meeting)లో రైతు భరోసాపై ఎలాంటి చర్చ జరగలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్‌కు హాజరు కాలేదు. నవంబర్, డిసెంబర్లో యాసంగి సీజన్ పనులు ప్రారంభం అవుతాయి. సగం సీజన్ గడిచినా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Rythu Bharosa Delay | గతంలో సైతం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేలు జమ చేశారు. అనంతరం ఒక సీజన్లో రైతు భరోసా జమ చేయలేదు. మరో సీజన్లో నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే నిధులు విడుదల చేశారు. గత వానాకాలం సీజన్లో మాత్రమే అందరు రైతులకు నిధులు విడుదల చేశారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే ఆ సమయంలో స్థానిక ఎన్నికలు (Local Elections) పెట్టాలని ప్రభుత్వం ఆలోచించింది. దీంతోనే నిధులు విడుదల చేసినట్లు విమర్శలు వచ్చాయి.
సాగు భూములకు మాత్రమే రైతు భరోసా వేస్తామని మంత్రి తుమ్మల (Minister Tummala) గతంలో ప్రకటించారు. సంక్రాంతి తర్వాత సర్వే పూర్తి చేసి నిధులు విడుదల చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. అయితే ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. మొత్తం రైతులకు రైతు భరోసా విడుదల చేయాలంటే రూ.9 వేల కోట్లు అవసరం. దీంతో ఈ సీజన్లో రైతు భరోసా వేయకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

