అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India – Russia | ఇండియాకు ఆప్తమిత్రుడైన రష్యా మరోసారి స్నేహ హస్తం చాచింది. రష్యా నుంచి చమురు కొంటుందన్న అక్కసుతో అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించడాన్ని మాస్కో తీవ్రంగా పరిగణించింది.
ఈ నేపథ్యంలో టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్లోకి (American Market) ప్రవేశించడంలో ఇబ్బంది ఉంటే తమ దేశంలోకి రావాలని ఆహ్వానం పలికింది. అమెరికాకు భారత ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇబ్బందికరంగా మారితే వాటిని రష్యా స్వాగతిస్తుందని భారతదేశంలోని రష్యన్ రాయబార కార్యాలయం (Russian Embassy) చార్జి డి’అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన రష్యా రాయబారి “భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, రష్యన్ మార్కెట్ (Russian Market) భారత ఎగుమతులను స్వాగతిస్తోంది” అని పేర్కొన్నారు.
India – Russia | భారత్‌పై ఒత్తిడి చేయడం అన్యాయం
టారిఫ్‌లతో భారతదేశంపై ఒత్తిడి చేయడం అన్యాయమని, ఏకపక్షమని విమర్శించారు. ఆయన పశ్చిమ దేశాల “నవ వలసవాద ప్రవర్తన” కోసం కూడా లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఒకవేళ ఇండియా రష్యా చమురును (Russian Oil) నిరాకరిస్తే, పశ్చిమ దేశాలు ఆ మేరకు సహాయం చేయలేవని విమర్శించారు. పాశ్చాత్వ స్వభావంలో ఇలాంటి ఉండవని గతంలో చాలాసార్లు నిరూపితమైందన్నారు.
అమెరికా విధించిన టారిఫ్‌లపై రష్యా రాయబారి విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలు సరఫరా గొలుసు (సప్లై చైన్)కు అంతరాయం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు కాగా, భారతదేశం అతిపెద్ద వినియోగదారు అయినందున అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని బాబుష్కిన్ (Roman Babushkin) అన్నారు.
India – Russia | భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం
ఇండియాతో రష్యాకు వాస్తవికమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని బాబుష్కిన్ తెలిపారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా నిలబడ్డాయన్నారు. మాస్కో ఢిల్లీకి చమురు సరఫరాను కొనసాగిస్తుందని, ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగం ఉందని చెప్పారు. “సవాలుతో కూడిన పరిస్థితులు” ఉన్నప్పటికీ, ఇండియా చమురు కొనుగోలును ఆపుతుందని రష్యా భావించడం లేదని, రెండు దేశాల మధ్య ఉన్న నిజమైన వ్యూహాత్మక భాగస్వామ్యమే ఇందుకు కారణమని రాయబారి తెలిపారు. “పశ్చిమ దేశాలు మిమ్మల్ని విమర్శిస్తే, మీరు సరిగ్గా వ్యవహరిస్తున్నారనే అర్థం. అలా జరుగుతుందని (చమురు కొనుగోలు నిలిపివేస్తారని).. మేము ఆశించము.. ఎందుకంటే భారతదేశానికి ఉన్న సవాలుతో కూడిన పరిస్థితుల గురించి మాకు తెలుసు” అని ఆయన వివరించారు.
India – Russia | ఏం జరిగినా మేమున్నాం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరిగినా భారత్‌కు బాసటగా తామున్నామని రష్యా రాయబారి తెలిపారు. “ఏది జరిగినా, ఈ సవాళ్ల సమయంలో కూడా, ఏవైనా సమస్యలను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నాము.. ఉక్రెయిన్‌లో ఇటీవలి పరిణామాల గురించి వివరిస్తూ అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీ (Prime Minister Modi) జీకి ఇటీవల చేసిన ఫోన్ కాల్, భారతదేశం రష్యా మధ్య ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనం. పరస్పర ప్రయోజనాల కోసం మేము ఏదైనా పరిష్కారాన్ని కనుగొనగల సామర్థ్యం కలిగి ఉన్నాం. మా భాగస్వామ్యం మరింతగా పెరగడం వల్ల మనం కలిసి ఎదగడానికి సహాయపడుతుందని” తెలిపారు. ప్రధాని మోదీని కలవడానికి అధ్యక్షుడు పుతిన్ (Russian President Putin) ఈ ఏడాది చివరలో ఇండియా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని బాబుష్కిన్ ధ్రువీకరించారు.