అక్షరటుడే, నిజాంసాగర్ : India – China | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెర లేపిన వాణిజ్య యుద్ధం భౌగోళిక, రాజకీయాల్లో కీలక మార్పులు తెస్తోంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వల్ల ప్రధానంగా భారత్, చైనా మధ్య స్నేహం బలపడుతోంది. భారత్‌పై వాణిజ్య సుంకాలతో భయపెట్టాలని అమెరికా చూస్తుండగా.. చైనా బాసటగా నిలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (External Affairs Minister Jaishankar) చైనాలో పర్యటించగా, తాజాగా డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. భారత్ తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎరువులు, అరుదైన ఖనిజాలు, టన్నెల్ బోరింగ్ మెషిన్ల కొరతను తీర్చేందుకు డ్రాగన్ సుముఖత తెలిపింది. సోమవారం ఢిల్లీలో (Delhi) జరిగిన విదేశాంగ శాఖ మంత్రల సమావేశంలో ఈ మేరకు వాంగ్ యి జైశంకర్‌కు హామీ ఇచ్చారు.
India – China | సహకారం పెంపొందించుకునేలా..
ఇండియా, చైనా మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిళ్లు, ప్రాంతీయ సమస్యలపై విదేశాంగ శాఖ మంత్రులు సోమవారం విస్తృత చర్చలు జరిపారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, ఆసక్తి అనే అంశాల ద్వారా పురోగతి అవసరమని ఇరుపక్షాలు నొక్కిచెప్పాయి. ఇరు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా మారకూడదని జైశంకర్ పేర్కొన్నారు.
సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని చైనా మంత్రి వాంగ్ యి (Chinese Minister Wang Yi) తెలిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని, వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు చర్చలు జరిపామన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి, ఆర్థిక సహకారం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నాలలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు, ఆహార భద్రతకు అవసరమైన కీలకమైన వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవడానికి చైనా ఆసక్తి చూపుతోంది.
India – China | ఎరువుల కొరతకు చెక్..
చైనా ఎరువుల సరఫరాకు ముందుకు వస్తే దేశంలో ఎరువుల కొరత సమస్య తీరిపోనుంది. గతంలో చైనా నుంచే మనకు భారీగా ఎరువులు దిగుమతి అయ్యేవి. భారత్ దిగుమతి చేసుకునే రసాయనాల్లో దాదాపు 80 శాతం డ్రాగన్‌వే ఉండేవి. అయితే, గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి సరఫరాలు నిలిచి పోయాయి. భారత్‌కు ఎరువుల సరఫరాపై డ్రాగన్(Dragon) అధికారికంగా నిషేధం విధించక పోయినప్పటికీ, కావాలనే ఆటంకాలు కలిగించింది. దీంతో మనకు ఎరువుల సమస్య తీవ్రమైంది. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతుండడం, ఎరువులతో పాటు అరుదైన ఖనిజాలు, టీబీఎంల సరఫరాకు చైనా నుంచి హామీ లభించడం పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. చైనా నుంచి ఎరువుల సరఫరా పునరుద్ధరణ జరిగితే రైతాంగానికి మేలు కలగడంతో పాటు కేంద్రానికి వివిధ మార్గాల్లో ఖర్చుల భారం తగ్గనుంది.