అక్షరటుడే, ఇందూరు : Advocate Attack Case | రుద్రూర్లో న్యాయవాది కళ్యాణిపై ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు.
జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి రుద్రూర్ బయలుదేరిన బీజేపీ నాయకులను సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ఓ వర్గంపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తి అదుపు తప్పిందని, హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government) పూర్తిగా విఫలమైందన్నారు.
Advocate Attack Case | బాన్సువాడ, రుద్రూర్‌లలో..
బాన్సువాడ (Banswada), రుద్రూర్లో జరిగిన ఘటనలు కేవలం యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడులేనని ఆరోపించారు. హిందువులపై దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మౌనం వహించడం వెనక తీవ్రమైన రాజకీయ స్వార్థాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దాక్కున్నారని, ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ కుమార్, ఆనందరావు, రాజు, బొబ్బిలి వేణు, నరేష్, విజయ్ కృష్ణ, చిరంజీవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advocate Attack Case | దాడిపై మహిళా న్యాయవాది ఫిర్యాదు..
అక్షరటుడే, బాన్సువాడ : రుద్రూర్లో (Rudrur) తనపై దాడి జరిగిందని పేర్కొంటూ మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బోధన్ బార్ అసోసియేషన్ (Bodhan Bar Association) సభ్యులతో కలిసి సోమవారం రుద్రూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. మహిళా న్యాయవాది తన ఇంటి నుంచి స్కూటీపై బోధన్‌కు వెళ్తుండగా ఓ బాలుడిని కొందరు వ్యక్తులు కొడుతుండడాన్ని గమనించారు. ఏం జరిగిందని ప్రశ్నించిన ఆమెపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధిత న్యాయవాది రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో (Rudrur Police Station) ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రుద్రూర్ ఎస్సైపై బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు (ACP Srinivasa Rao)కు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రుద్రూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఏసీపీ, సీఐ విజయ్ బాబు పీఎస్‌కు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

