అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rudra | శత్రు మూకల ఆట కట్టించేందుకు భారత సైన్యం (Indian Army) ఎప్పటికప్పుడు తన శక్తిని బలోపేతం చేసుకుంటోంది. అధునాతన సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో ఓ శక్తివంతమైన దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Chief of Army Staff General Upendra Dwivedi) వెల్లడించారు.
శనివారం లడఖ్‌లోని ద్రాస్ పట్టణంలో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ వేడుకల (Kargil Vijay Diwas celebrations) సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా “రుద్ర” (Rudra) పేరిట కొత్త ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత సైన్యాన్ని ఆధునికీకరణ, పరివర్తన వైపు తీసుకెళ్లే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తు ఆవసరాల రీత్యా ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్‌లు, ప్రాణాంతక ప్రత్యేక దళాల విభాగాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
Rudra | భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా..
ప్రస్తుత సవాళ్లను అధిగమించడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ద్వివేది వివరించారు. “నేటి భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా పరివర్తన చెందే, ఆధునిక, భవిష్యత్తు-ఆధారిత దళంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ‘రుద్ర’ అనే కొత్త ఆల్-ఆర్మ్స్ బ్రిగేడ్‌లు (All Arms Brigade) ఏర్పడుతున్నాయని” చెప్పారు. పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగిదళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి పోరాట భాగాలను ఆల్ ఆర్మ్స్ బ్రిడేడ్ కలిగి ఉంటాయన్నారు. దీనికి అనుకూలీకరించిన లాజిస్టిక్స్. పోరాట మద్దతు మద్దతు ఉంటుందన్నారు.
Rudra | భైరవ్ యూనిట్లు..
సరిహద్దుల్లో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు భైరవ్ అనే లైట్ కమాండో బెటాలియన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. “చురుకైన, ప్రాణాంతకమైన ప్రత్యేక దళాల యూనిట్లు అయిన ‘భైరవ్’ లైట్ కమాండో బెటాలియన్లు సరిహద్దులో శత్రువులను దిగ్భ్రాంతికి గురిచేయడానికి స్థాపించబడ్డాయి. ప్రతి పదాతిదళ బెటాలియన్‌లో ఇప్పుడు డ్రోన్ ప్లాటూన్‌లు ఉన్నాయి, అయితే ఫిరంగిదళం దివ్యస్త్ర బ్యాటరీలు, లోయిటర్ మునిషన్ బ్యాటరీల ద్వారా దాని ఫైర్‌పవర్‌ను అనేక రెట్లు పెంచింది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (Army air defence) స్వదేశీ క్షిపణి వ్యవస్థలతో అమర్చబడుతోంది. ఇది మా బలాన్ని అనేక రెట్లు పెంచుతుంది,” అని ద్వివేది చెప్పారు. రెండు పదాతిదళ బ్రిగేడ్‌లను ఇప్పటికే రుద్ర బ్రిగేడ్‌లుగా (Rudra brigades) మార్చారన్నారు. ఇప్పటివరకు, సైన్యంలో ఆయుధ-నిర్దిష్ట బ్రిగేడ్‌లు మాత్రమే ఉండేవి, కానీ రుద్ర ఆయుధాల మిశ్రమంగా ఉంటుంది.