అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy | ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులపై దాడికి యత్నించిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రామారెడ్డిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
బాధిత మహిళ, పోలీసుల కథనం ప్రకారం..రామారెడ్డి మండలం (Ramareddy mandal) మద్దికుంట గ్రామానికి చెందిన రమేష్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అతడు దుబాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా (West Godavari district) భీమవరం ప్రాంతానికి చెందిన బూసి బేబీ అనే యువతితో ప్రేమలో పడ్డాడు.
అనంతరం తనను లోబర్చుకుని సుమారు రూ.12 లక్షలు, 8 తులాల బంగారాన్ని రమేష్ కాజేశాడని బాధితురాలు ఆరోపించింది. తనను మోసం చేసి పాల్వంచ మండలం (Palvancha mandal) ఇసాయిపేట గ్రామానికి చెందిన మరో యువతితో వివాహం చేసుకున్నట్లుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆంధ్రలోని భీమవరంలో రమేష్‌పై కేసు నమోదైంది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ ఎస్సై వీర్రాజుతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మద్దికుంట గ్రామానికి మఫ్టీలో వచ్చారు. వారిని చూసిన రమేష్ ‘‘మీరు పోలీసులు కారని’’ దాడికి పాల్పడ్డాడు. రమేష్ బంధువుల సైతం పోలీసులపైకి దాడికి దిగారు. వెంటనే భీమవరం పోలీసులు (Bhimavaram police) స్థానిక రామారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మద్యంమత్తులో ఉన్న రమేష్, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి పోలీస్ స్టేషన్లో హంగామా చేశారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా విధులు ఉన్న పోలీసులపై దాడికి రమేష్ కుటుంబ సభ్యులు యత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన రమేష్‌తో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు రామారెడ్డి పోలీసులు తెలిపారు.
