అక్షరటుడే, వెబ్డెస్క్: Ponnam Prabhakar | నష్టాలతో మూసేసే పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ కళా భవన్లో (RTC Kala Bhavan) జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఆర్టీసీలో 30 ఏళ్లకుపైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లను మంత్రి సన్మానించారు. వారికి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి తదితరులు పాల్గొన్నారు.
Ponnam Prabhakar | ఆదర్శంగా నిలవాలి
ప్రమాదాలను తగ్గించి ఆర్టీసీ ఆదర్శంగా నిలవాలని మంత్రి పొన్నం సూచించారు. 20 వేల డ్రైవర్లు, 10 వేల బస్సులు ఉన్న సంస్థ నిత్యం 60 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల (RTC workers) సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలుగా నిర్వహించేవారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని చెప్పారు.
Ponnam Prabhakar | రోడ్డు భద్రతపై అవగాహన
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. పిల్లల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు అధికారులతో సహకరించాలని కోరారు. అంతకుముందు మంత్రి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 పోస్టర్ను ఆవిష్కరించారు.