HomeతెలంగాణTGSRTC | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. భారీగా ఛార్జీల పెంపు

TGSRTC | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. భారీగా ఛార్జీల పెంపు

హైదరాబాద్​ నగరంలోని సిటీ బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు ఈ నెల 6 నుంచి అమలులోకి రానున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​ ఇచ్చింది. హైదరాబాద్​ (Hyderabad) నగరం పరిధిలో సిటీ బస్సుల్లో టికెట్​ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శనివారం కీలక ప్రకటన చేసింది. ఆర్థిక భారం మోయలేని తరుణంలో.. జంట నగరాల్లో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు టికెట్​ ధరపై రూ.5 పెంచనున్నారు. 4వ స్టేజీ నుంచి రూ.10 అదనంగా ఛార్జీ చేయనున్నారు. మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో సైతం రేట్లు పెంచారు. మొదటి స్టేజీకి రూ.5, రెండోస్టేజీ తర్వాత రూ.10 చొప్పున టికెట్​ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్త ధరలు ఈ నెల 6 నుంచి అమలులోకి రానున్నాయి.

TGSRTC | ప్రయాణికులపై భారం

టికెట్​ రేట్ల పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. హైదరాబాద్​ నగరంలో కొన్ని నెలల క్రితం మెట్రో ఛార్జీలు సైతం పెరిగాయి. ఓ వైపు మహిళలకు ఆర్డీనరి, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే టికెట్​ రేట్ల పెంపుతో ఆ నష్టాలను భర్తీ చేసుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కాగా జూన్​లో నగరంలో ఆర్టీసీ బస్​పాస్ (RTC Bus Pass)​ ఛార్జీలను సైతం భారీగా పెంచిన విషయం తెలిసిందే.

TGSRTC | కొత్తగా ఎలక్ట్రిక్​ బస్సులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్​ బస్సులను సమకూర్చుకోనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో ఎలక్ట్రిక్​ బస్సులు నడుస్తున్నాయి. కొత్తగా 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం చూస్తోంది. ఈ బస్సులలో మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం జీహెచ్​ఎంసీ పరిధిలో 25 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆరు డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మరో 275 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితి లేదని సంస్థ పేర్కొంటుంది. దీంతోనే ఛార్జీలు పెంచినట్లు చెబుతోంది. కాగా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడం కోసం దశల వారీగా ఎలక్ట్రిక్​ బస్సులను ప్రవేశ పెడుతామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.