అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGSRTC | తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) సంస్థ నిరుద్యోగ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ(ITI) కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. ఆయా ట్రేడ్‌లలో ప్రవేశం పొందినవారికి వారు కోరుకున్న డిపోలలో అప్రెంటిస్ షిప్ (Apprenticeship) సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది.
స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఐటీఐ విద్య ఉపయోగకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు వృత్తి శిక్షణ అందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆర్టీసీ సంస్థ కూడా ఐటీఐ కళాశాలలను నిర్వహిస్తోంది. వరంగల్(Warangal), హైదరాబాద్‌లలో సంస్థ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యార్థులు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కోర్సుల్లో చేరడానికి ఆసక్తిగల వారు వరంగల్, హకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో నేరుగా సంప్రదించవచ్చని సంస్థ పేర్కొంది. ఆయా ట్రేడ్‌లలో ప్రవేశం పొందినవారికి వారు కోరుకున్న టీజీఎస్ ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ షిప్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. దరఖాస్తులతో పాటు ఇతర వివరాల కోసం https://iti.telangana.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలని సూచించింది.