అక్షరటుడే, ఎల్లారెడ్డి : RTC Bus | ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణం నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు పున: ప్రారంభించారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో గత నెల 26, 27 తేదీల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా చాలా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్, బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో ఎల్లారెడ్డికి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
RTC Bus | మరమ్మతులు చేసినా..
రోడ్లు తెగిపోయిన ప్రాంతాల్లో అధికారులు మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయితే మట్టి రోడ్డు దిగబడుతుందని బస్సులు, ఇతర భారీ వాహనాలను ఆయా మార్గాల్లో అనుమతించలేదు. దీంతో గత నెల 27 నుంచి ఎల్లారెడ్డికి ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా అధికారులు బస్సు సర్వీసులను ప్రారంభించారు. దీంతో ఇన్ని రోజులు బస్సులు లేక ఇబ్బంది పడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RTC Bus | హైదరాబాద్ మార్గంలో..
ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి, బాన్సువాడ మార్గాల్లో రోడ్లకు గతంలోనే మరమ్మతులు చేశారు. అయితే ఎల్లారెడ్డి నుంచి మెదక్, హైదరాబాద్ వెళ్లే మార్గంలో పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) దిగువన బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఇక్కడ మరమ్మతు పనులు ఇటీవల పూర్తి చేశారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ఎల్లారెడ్డి వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల క్రితం రోడ్డు మరమ్మతులు పూర్తి కాగా.. తాజాగా ఆర్టీసీ బస్సులు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి. ఎల్లారెడ్డి- హైదరాబాద్, ఎల్లారెడ్డి -కామారెడ్డి, ఎల్లారెడ్డి –బాన్సువాడ మధ్య ఆర్టీసీ బస్సులను ప్రారంభించడంతో ప్రయాణికుల తిప్పలు తప్పాయి.