అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Bus | రెండు రోజుల క్రితం కదులుతున్న ఆర్టీసీ బస్సు(RTC Bus)లో మంటలు చెలరేగిన మెహిదీపట్నం(Mehidipatnam)లో జరిగిన విషయం తెలిసిందే. బస్సు మెహదీపట్నం బస్టాండ్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి, అందరిని బస్సు నుండి కిందకు దింపేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కాని బస్సు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తత వలన ఎవరికి పెద్దగా గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మరిచిపోకముందే.. విశాఖపట్నం(Visakhapatnam)లో శుక్రవారం ఉదయం ఒక భయానక ఘటన చోటుచేసుకుంది.
RTC Bus | ప్రమాదం తప్పింది..
శాంతిపురం జంక్షన్(Shantipuram Junction) వద్ద రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. కుర్మన్నపలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం జరిగింది.బస్సు విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్(Fourth Town Police Station) పరిధిలోని శాంతిపురం వద్దకి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపి, ప్రయాణికులందరినీ కిందకు దింపడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ప్రయాణికులు దిగిన కొన్ని క్షణాల్లోనే మంటలు బస్సును పూర్తిగా వ్యాపించాయి..
చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద స్థలానికి సమీపంలో ఒక హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉండటంతో కొంత సేపు స్థానికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. అయితే, స్పష్టమైన కారణాలపై అధికారులు పూర్తి విచారణ చేపట్టారు.ఆర్టీసీ అధికారులు(RTC Officers) మాట్లాడుతూ, ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదని, బస్సు పూర్తిగా దగ్దమైనప్పటికీ అందరి ప్రాణాలు సురక్షితంగా ఉండడం ఊరటనిచ్చే విషయం అని తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.