Homeతాజావార్తలుWarangal | ఏసీబీ అధికారుల పేరు చెప్పి ఆర్టీఏ ఉద్యోగులకు టోకరా.. రూ.10 లక్షలు కాజేసిన...

Warangal | ఏసీబీ అధికారుల పేరు చెప్పి ఆర్టీఏ ఉద్యోగులకు టోకరా.. రూ.10 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఏసీబీ అధికారుల పేరు చెప్పి ఆర్టీఏ ఉద్యోగులకు టోకరా వేశారు కేటుగాళ్లు. వారి నుంచి రూ.10 లక్షలు కాజేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | రాష్ట్రంలో ఇటీవల ఏసీబీ దాడులు (ACB Raids) పెరిగిపోయాయి. నిత్యం దాడులు జరుగుతుండటంతో అవినీతి అధికారులు భయ పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏసీబీ పేరు చెప్పి అవినీతి అధికారుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.

వరంగల్​ ఆర్టీఏ కార్యాలయం (Warangal RTA Office)లో ఇటీవల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం కొద్ది రోజులకు కొంతమంది ఆర్టీఏ అధికారులకు ఫోన్ చేశారు. తాము ఏసీబీ అధికారులమని నమ్మించారు. ఆర్టీఏ అధికారులు అరెస్టు కాకుండా ఉండాలంటే తాము అడిగిన డబ్బు చెల్లించాలని దుండగులు బెదిరించారు. దీంతో సదరు అధికారులు దశలవారీగా రూ.10.20 లక్షలు వారికి చెల్లించారు.

Warangal | అనుమానం రావడంతో..

దుండగులతో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఒక అధికారికి అనుమానం వచ్చింది. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ విచారణకు ఆదేశించారు. వారి విచారణ అనంతరం తాము మోసపోయామని ఆర్టీఏ అధికారులు (RTA Officers) గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Warangal | అవగాహన కల్పిస్తున్నా..

ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) అవగాహన కల్పిస్తున్నారు. తమ పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అయినా కానీ కొందరు అధికారులు మోసపోతుండటం గమనార్హం. అయితే ఇలా మోసపోయే వారిలో అవినీతికి పాల్పడే వారు ఉన్నట్లు తెలుస్తోంది. లంచాలు తీసుకోని వారు అడగ్గానే డబ్బులు ఎందుకు ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్న అధికారులను కేటుగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం.