HomeజాతీయంRSS | ఇంతింతై.. వటుడింతై.. దేశమంతా విస్తరించిన ఆర్‌ఎస్‌ఎస్‌

RSS | ఇంతింతై.. వటుడింతై.. దేశమంతా విస్తరించిన ఆర్‌ఎస్‌ఎస్‌

అక్షరటుడే, న్యూఢిల్లీ: RSS | హిందూ సంఘటన కోసం నాగ్‌పూర్‌(Nagpur)లో చిన్న శాఖగా ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌ఎస్‌(RSS).. క్రమంగా విస్తరిస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.

దేశం నలుమూలలా విస్తరించింది. మారుమూల గ్రామాలు, తండాలలోనూ శాఖలను ఏర్పాటు చేసింది. సంఘ్‌(Sangh) వివిధ క్షేత్రాలలో ఏర్పాటు చేసిన సంస్థలు ప్రపంచంలోనే అతిపెద్దవిగా గుర్తింపు పొందాయి. డాక్టర్‌ కేశవ బలిరాం హెడ్గేవార్‌(Keshav Baliram Hedgewar) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (Rashtriya Swayamsevak Sangh – RSS)ను స్థాపించారు. ఎటువంటి సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల వంటివి లేని ఒక సంస్థ వందేళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది.

సుమారు 80 లక్షల మంది కార్యకర్తలు కలిగిన సంస్థ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతుండటం విశేషం. హెడ్గేవార్‌ ప్రారంభించిన సంఘటన యజ్ఞాన్ని ఆ తర్వాతి సర్‌ సంఘ్‌ చాలక్‌లు ముందుకు తీసుకువెళ్లారు. డాక్టర్జీగా పిలువబడే హెడ్గేవార్‌ హయాంలో ప్రారంభమైన సంఘ్‌.. మాధవ సదాశివ గోల్వల్కర్‌ Madhava Sadashiv Golwalkar (గురూజీ), మధుకర్‌ దత్తాత్రేయ దేవరస్‌ Madhukar Dattatreya Deoras హయాంలో విశ్వవ్యాప్తమైంది. వారు హిందూ(Hindu) సంఘటన కోసం సంఘాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకున్నారు. వివిధ క్షేత్రాలకు సంబంధించి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి సంఘాన్ని ముందుకు నడిపించారు.

RSS | సంఘ్‌ ‘పరివార్‌’..

కార్మికుల సంక్షేమ కోసం భారతీయ మజ్దూర్‌ సంఘ్(Bharatiya Mazdoor Sangh), రైతుల కోసం భారతీయ కిసాన్‌ సంఘ్, విద్యార్థుల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP), వనవాసుల కోసం వనవాసి కల్యాణ ఆశ్రమం, మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సమితి ఏర్పాటు చేశారు. వివిధ క్షేత్రాలలో అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షణిక్‌ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ భావన పెంపొందించేందుకు స్వదేశీ జాగరణ మంచ్, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్, సామాజిక సమరసతా వేదిక వంటి సంస్థలు సేవలందిస్తున్నాయి.

సరస్వతి శిశు మందిర్‌(Shishu mandir)లు చిన్నప్పటినుంచే సంస్కారాలను నేర్పుతున్నాయి. వీటన్నింటిని కలిపి ‘సంఘ్‌ పరివార్‌’గా పిలుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఈ సంస్థలున్నా.. వేటికవే స్వయం‍ప్రతిపత్తితో పనిచేస్తూ కలిసికట్టుగా హిందూ సంఘటన మహాయజ్ఞంలో ముందుకు సాగుతున్నాయి. రాజకీయ రంగంలో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. అలాగే భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆయా రంగాలలో రికార్డు స్థాయి సభ్యులను కలిగి ఉన్నాయి.

RSS | నిత్య శాఖే స్ఫూర్తి..

మొదటగా ధ్వజారోహణంతో నిత్య శాఖ(Daily Shakha) ప్రారంభమవుతుంది. గంట పాటు నిర్వహించే శాఖలో ఆసనాలు, యోగ, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే ప్రసంగాలు ఉంటాయి. చివరగా ప్రార్థనతో కార్యక్రమం ముగుస్తుంది. ఇలా నిత్యశాఖలో పాల్గొన్న ఎందరో దేశసేవకు ముందుకు వచ్చారు. వేలాది మంది ప్రచారక్‌లుగా తమ జీవితాలను దేశమాత సేవలో అర్పించారు.

సేవా కార్యక్రమాలలో ముందువరుసలో..

1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్‌ –చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్‌ – పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో, భూకంపాలు, తుపానులు, రైలు ప్రమాదాలు, కరవు కాటకాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్‌ – చైనా యుద్ధ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సేవలను గుర్తించిన నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ(Nehru) 1963లో రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనాల్సిందిగా సంఘ్‌ను ఆహ్వానించారు. ప్రస్తుతం సుమారు 4 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలుగా (ప్రచారకులు) దేశ, విదేశాల్లో వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు.