HomeతెలంగాణPashamilaram | పాశ‌మైలారం ఘటన మృతుల కుటుంబాలకు రూ.కోటి ప‌రిహారం..: సీఎం రేవంత్‌

Pashamilaram | పాశ‌మైలారం ఘటన మృతుల కుటుంబాలకు రూ.కోటి ప‌రిహారం..: సీఎం రేవంత్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pashamilaram | పాశ‌మైలారంలో జ‌రిగిన ఘోర దుర్గ‌ట‌న‌లో చ‌నిపోయిన కుటుంబాల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ప్రభుత్వం, కంపెనీ రూ.కోటి చొప్పున ప‌రిహారం అందిస్తామని ప్ర‌క‌టించారు. ప్రమాదంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ(Sigachi Chemical Factory)లో రియాక్ట‌ర్ పేలి 40 మంది చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌మాదం జ‌రిగిన ఫ్యాక్ట‌రీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు.

Pashamilaram | ఘోర దుర్ఘ‌ట‌న‌

పాశ‌మైలారం ఫ్యాక్ట‌రీ(Pashamilaram Factory)లో జ‌రిగిన ప్ర‌మాదం అత్యంత విషాదకరమైన దుర్ఘటన అని రేవంత్ అన్నారు. ఇప్పటివరకు ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఇప్పటి వరకు 36 మంది చనిపోయారని తెలిపారు. పేలుడు స‌మ‌యంలో 143 మంది ఉన్నార‌ని, 58 మందిని అధికారులు గుర్తించారని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివ‌రించారు. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన‌ట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్సఅందించాలని ఆదేశించామ‌న్నారు.

Pashamilaram | బాధ్యుల‌పై చ‌ర్య‌లు..

ప్ర‌మాదానికి బాధ్యులైన వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తామ‌న్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్‌స్పెక్షన్(Periodic Inspection) చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని, మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామ‌న్నారు.

Pashamilaram | ఫ్యాక్ట‌రీ బాధ్యులు, అధికారుల‌పై సీఎం ఫైర్‌

అంత‌కు ముందు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాక్ట‌రీ యాజ‌మాన్యం, అధికారుల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా? ఈ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా? అని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తనకు తెలియాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యం స్పందించిందా? అని మరో ప్రశ్న వేశారు. ఊహాజనిత జవాబులు కాకుండా వాస్తవాలను తెలపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతోందని.. ఘటనా స్థలికి యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారని నిలదీశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాన్ని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త‌దితరులు ఉన్నారు.