అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పేలుడు ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. సిగాచి పరిశ్రమ(Cigachi Industry)లో రియాక్టర్ పేలడంతో 40 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
కొంతమంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రియాక్టర్ పేలుడుపై సిగాచి కంపెనీ స్పందించింది. పాశమైలారం(Pashamylaram) రియాక్టర్ పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ఫ్యాక్టరీని సందర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. ఫ్యాక్టరీతో మాట్లాడి రూ.కోటి పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా సిగాచి పరిశ్రమ యాజమాన్యం స్పందించింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారని తెలిపింది. 33 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
పరిశ్రమ నుంచి రూ.కోటి పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని పేర్కొంది. క్షతగాత్రులకు పూర్తి వైద్యసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి కంపెనీ సెక్రెటరీ వివేక్‌కుమార్(Secretary Vivek Kumar) తెలిపారు.
Pashamylaram | మూడు నెలల పాటు మూసివేత
ప్రమాదంతో కంపెనీలో కార్యకలాపాలు మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు వివేక్‌కుమార్ తెలిపారు. ఈ ఘటనపై స్టాక్‌మార్కెట్‌కు సైతం కంపెనీ లేఖ రాసింది. అయితే ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్నారు. దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నట్లు పేర్కొన్నారు.