ACB Raids
ACB Raids | బాత్​రూంలో రూ.20 లక్షలు.. ఏడీఈ బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టీజీఎన్​పీడీసీఎల్​ (TGNPDCL)లో సహాయక డివిజనల్ ఇంజినీరు (ఆపరేషన్స్) ఇరుగు అంబేడ్కర్​ (ADE Ambedkar)ను ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏడీఈతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో మంగళవారం ఏసీబీ దాడులు (ACB Raids) చేపట్టింది. 11 ప్రదేశాలలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు అంబేడ్కర్​ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బుధవారం సైతం ఆయన బినామీల ఇళ్లలో తనిఖీలు కొనసాగాయి.

ACB Raids | బాత్​రూంలో నోట్ల కట్టలు

చేవెళ్ల విద్యుత్ ఏడీ రాజేష్‌ (Chevella AD Rajesh) ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏడీఈ అంబేద్కర్‌కు రాజేష్​ బినామీగా ఉన్నారు. ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లో రూ.20 లక్షలు దొరికాయి. దీంతో అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి మొత్తాన్ని తనిఖీ చేస్తున్నారు.

ACB Raids | 14 రోజుల రిమాండ్​

ఏడీఈ అంబేడ్కర్​ను మంగళవారం అధికారులు అరెస్ట్​ చేశారు. బుధవారం ఉదయం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టు (Nampalli ACB Court)లో హాజరు పర్చారు. ఏడీఈకి జడ్జి 14 రోజుల రిమాండ్​ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్​గూడ జైలుకు తరలించారు. కాగా ఏడీఈ రూ.300 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్​లో ఆరు ప్లాట్లు, ఒక ఇళ్లు, ఒక ఐదంతస్తుల భవనం, వెయ్యి గజాల స్థలం, సూర్యాపేట జిల్లాలో పదెకరాల భూమి ఉన్నాయి. అంతేగాకుండా ఆయన బంధువు ఇంట్లో ఏకంగా రూ.రెండు కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.