అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anil Ambani | ప్రాముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఈడీ కార్యాలయంలో (ED Office) విచారణకు హాజరయ్యారు. బ్యాంకుల నుంచి అక్రమంగా రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆయనపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కార్యాలయానికి ఆయన విచారణ నిమిత్తం వెళ్లారు. అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్‌పై ఈడీ అధికారులు విచారించనున్నారు.
Anil Ambani | సోదాల అనంతరం
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా అనిల్ అంబానీ (Anil Ambani) గ్రూప్‌కు చెందిన అనేక సంస్థలు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.17 వేల కోట్ల బ్యాంకు రుణాలను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో జులై 24న ముంబైలోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. అనంతరం విచారణకు హాజరు కావాలని ఈడీ అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది.
Anil Ambani | యెస్ బ్యాంకు నుంచి..
రిలయన్స్ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీలు 2017నుంచి 2019 మధ్య యెస్ బ్యాంక్ (Yes Bank) మంజూరు చేసిన సుమారు రూ.3 వేల కోట్ల రుణాలను మళ్లించాయి. డొల్ల కంపెనీల ద్వారా వాటిని మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాల మంజూరు సమయంలో యెస్ బ్యాంకు నిబంధనలు పాటించలేదని ఈడీ అధికారులు(ED Officers) గుర్తించారు. అంతేగాకుండా లోన్లు ఇచ్చే కొంతకాలం ముందు యెస్ బ్యాంక్ ప్రమోటర్ల కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో డబ్బు వచ్చినట్లు తెలిపింది. రుణ మంజూరు కోసం ప్రమోటర్లు క్విడ్ ప్రోకో పద్ధతిలో మోసానికి పాల్పడ్డారని గుర్తించారు.
Anil Ambani | మనీ లాండరింగ్‌పై విచారణ
అనిల్ అంబానీకి చెందిన సంస్థలు తీసుకున్న రుణాలను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి మనీ లాండరింగ్‌కు (Money laundering) పాల్పడ్డట్లు ఈడీ పేర్కొంది. ఈ మేరకు మనీ లాండరింగ్‌పై విచారణ చేపడుతోంది. అనిల్ అంబానీని అధికారులు ఇదే విషయమై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం ఏం చేశారు.. రుణం తీసుకోవడానికి ఎలాంటి నిబంధనలు పాటించారనే కోణంలో విచారిస్తున్నారు. RCOM, కెనరా బ్యాంక్ మధ్య జరిగిన రూ.1,050 కోట్ల రుణ మోసం కేసును సైతం ఈడీ పరిశీలిస్తోంది.