అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anil Ambani | పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) షాకిచ్చింది. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో ఈడీ సమన్లు(ED Summons) జారీ చేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మనీ లాండరింగ్ కేసు(Money Laundering Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సుమారు రూ.17,000 కోట్ల విలువైన బ్యాంకు రుణాల మోసం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దీంతో ఆగస్టు 5న న్యూఢిల్లీ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది.
Anil Ambani | కొత్త చిక్కులు..
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ(Anil Ambani) నుంచి ఈడీ స్టేట్‌మెంట్ తీసుకోనుంది. వారం రోజులుగా ముంబయిలోని అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాలపై మూడు రోజుల పాటు ఈడీ సోదాలు(ED Raids) నిర్వహించింది. దాదాపు 35 చోట్ల 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈ దర్యాప్తులో అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. యెస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రూ.3వేల కోట్ల రుణం పొందినట్లు, అవి విధి విధానాలకు విరుద్ధంగా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2017–2019 మధ్య కాలంలో ఈ రుణాలు మంజూరయ్యాయి. కాగా.. యెస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు(Yes Bank Former Promoters) లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పొందిన రూ.10,000 కోట్ల రుణాలను ఇతర ఉద్దేశాల కోసం మళ్లించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Reliance Communications), కెనరా బ్యాంక్ (Canara Bank) మధ్య జరిగిన రూ.1,050 కోట్ల రుణ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు ఈడీ భావిస్తోంది. AT-1 బాండ్ల ద్వారా బ్యాంకులు సేకరించిన నిధుల్లో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల రూపంలో రూ.2,850 కోట్లు వెచ్చించిన సమాచారం బయటపడింది. ఈ పెట్టుబడుల్లో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మొత్తాన్ని కలిపితే అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై రూ.17,000 కోట్లకుపైగా రుణ మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ముదిరిన నేపథ్యంలో, ఈడీ వారి విచారణను మరింత తీవ్రతరంగా కొనసాగిస్తోంది.