అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Jathara | తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతరను రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు. తెలంగాణ (Telangana) నుంచే కాకుండా దేశ నలుమూలుల నుంచి వన దేవతల దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. వచ్చే ఏడాది జరిగే జాతరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జాతర నిర్వహిస్తారు. గిరిజన దేవతలు సమ్మక్క (Sammakka), సారలమ్మ(Saralamma)కు ప్రత్యేక పూజలు చేస్తారు. అడవిలో కొలువైన అమ్మవార్లను దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. వనంమంతా జనంతో నిండిపోతుంది. వచ్చే ఏడాది జనవరిలో మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో ఏర్పాట్ల కోసం ప్రభుత్వం బుధవారం రూ.150 కోట్లు మంజూరు చేసింది. జాతర నిర్వహణ, భక్తులకు ఏర్పాట్ల కోసం వీటిని వినియోగించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మేడారం జాతరకు నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)కు మంత్రి సీతక్క(Minister Seethakka) కృతజ్ఞతలు తెలిపారు.
Medaram Jathara | నాలుగు రోజుల పాటు
మేడారం జాతర(Medaram Jathara) నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. వచ్చ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర కొనసాగనుంది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకుంటారు. 29న సమ్మక్కను చిలకలగుట్ట(Chilakalagutta) నుంచి గద్దెల వద్దకు తీసుకు వస్తారు. 31న దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు. వన దేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
Medaram Jathara | భక్తుల సౌకర్యార్థం..
మేడారం జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే భక్తులకు రద్దీకి అనుగుణంగా అక్కడ సౌకర్యాలు లేవు. జాతర సమయంలో స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతారు. అంతేగాకుండా రోడ్లు సక్రమంగా లేక భక్తులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతారు. ఈ క్రమంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చే జాతరను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేసింది. రోడ్లు, శాశ్వత భవనాలు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.