అక్షరటుడే, వెబ్డెస్క్: Tourists | గోవా పర్యాటక రంగంపై (Goa Tourism Sector) ఆధారపడిన రాష్ట్రం. ఏటా ఇక్కడకు లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దీంతో పర్యాటకుల సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం (Goa Government) చర్యలు చేపట్టింది. పర్యాటకులకు అసౌకర్యం కల్పించే వారికి రూ.లక్ష జరిమానా విధిస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ ఆ బిల్లును ఆమోదించింది. గవర్నర్ ఓకే చెబితే నూతన చట్టం అమలులోకి రానుంది.
గోవాలో (Goa) అనుమతి లేకుండా పడవలు నడపడం, పర్యాటక ఉత్పత్తులను కొనుగోలు చేయమని బలవంతం చేయడం, అనధికార ప్రాంతాలలో మద్యం తాగడం, టిక్కెట్లు అమ్మడం, భిక్షాటన చేయడం, బీచ్‌లలో వాహనాలు నడపడం వంటి ఘటనలు ఇటీవల పెరిగాయి. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గోవాలో పర్యాటకులకు (Goa Tourists) అసౌకర్యం కలిగించినందుకు రూ.లక్ష వరకు జరిమానా విధించడానికి బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు అమలులోకి వస్తే పర్యాటకులకు అసౌకర్యం కలిగించిన వారికి రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ వేయనున్నారు.
Tourists | చట్టంలో సవరణలు
పర్యాటక ప్రదేశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన జరిమానాలు విధించడానికి 2001 చట్టానికి గోవా ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారం పర్యాటకులను వస్తువులు, సేవలను కొనుగోలు చేయమని వేధించినా ఫైన్ పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం, అనధికార హాకింగ్, టికెట్ల ప్రచారం, అనుమతులు లేకుండా వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ నిర్వహిస్తే జరిమానా విధించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఈ జరిమానాను పెంచేలా చట్టంలో నిబంధన పొందు పరిచారు. గోవా పర్యాటక ప్రదేశాల సమగ్రతను నిలబెట్టడం, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే (Tourism Minister Rohan Khunte) తెలిపారు.