అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | పెద్దల భూములను కాపాడటానికి రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) అలైన్మెంట్ మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దీంతో పేద ప్రజలు భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో పర్యటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 19 ఏళ్లుగా జాగృతి పేరుతో తాను ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. ఈ సంస్థ బీఆర్ఎస్తో విబేధాల కారణంగా పెట్టిన సంస్థ కాదన్నారు. ఉద్యమకాలం నుంచి మన భాష, యాస మీద పోరాటం చేశామని గుర్తు చేశారు. తాము ఓట్ల కోసం రాలేదన్నారు. ఓట్లప్పుడు మాత్రమే నాయకులు ప్రజల్లోకి వచ్చే సంస్కృతి మారాలని పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha | బీఆర్ఎస్లో కీలకంగా లేను
తాను తెలంగాణ (Telangana) ప్రజల బాణాన్ని అని కవిత అన్నారు. తనను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలో ఎప్పుడు తాను కీలకంగా లేనని చెప్పారు. టీచర్‌ను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో తనను ఐదేళ్లు నిజామాబాద్‌కు పరిమితం చేశారన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో యాదాద్రి జిల్లాలో రైతులకు బేడీలు వేశారన్నారు. అప్పుడు తాను బీఆర్ఎస్లో ఉన్నానని, ఆ పాపంలో తనకు భాగం ఉన్నట్లేనని చెప్పారు. ఆమె రైతులకు క్షమాపణలు చెప్పారు.
Kalvakuntla Kavitha | ఎందుకు సస్పెండ్ చేశారో
బీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో కారణం తెలియటం లేదని కవిత అన్నారు. ఉరి వేసే వ్యక్తికి కూడా కారణం చెబుతారన్నారు. కానీ నన్ను మాత్రం ఏమీ అడగకుండానే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2029లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని ఆమె అన్నారు. అప్పుడు తాము కచ్చితంగా మేము బరిలో ఉంటామని తెలిపారు.
అసలు రింగ్ రోడ్డు అంటే పట్ణణాల చుట్టూ నుంచి వెళ్లేదని కవిత అన్నారు. కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో మాత్రం దాని విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ ఇలా చాలా ప్రాంతాల్లో ఈ రోడ్డు ఊర్లో నుంచి వెళ్తోందన్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఇప్పటికే మూడు నాలుగు సార్లు అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. పెద్దల భూములను రక్షించేందుకు పేదల భూములను బలి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతుల తరఫున జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.