అక్షరటుడే, వెబ్‌డెస్క్: Royal Challengers Bangalore | ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పుడు కొత్త అడుగులేస్తోంది.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ డయాజియో తమకు చెందిన ఆర్సీబీ ఫ్రాంచైజీని అధికారికంగా అమ్మకానికి పెట్టింది. ఇప్పటికే ఈ విక్రయ ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ధృవీకరించింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) కు పంపిన లేఖలో డయాజియో ఈ విషయాన్ని ప్రకటించింది. తమ భారతీయ అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఆధ్వర్యంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RCSPL) పెట్టుబడిపై “వ్యూహాత్మక సమీక్ష” (Strategic Review) ప్రారంభించామని తెలిపింది. ఈ సమీక్ష ప్రక్రియ 2026 మార్చి 31 నాటికి పూర్తవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
Royal Challengers Bangalore | కొనుగోలుదారుల కోసం రేస్ స్టార్ట్..!
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ మాట్లాడుతూ.. “ఆర్సీబీ మాకు విలువైన బ్రాండ్ అయినప్పటికీ, ఇది మా ప్రధాన వ్యాపారమైన మద్యపాన రంగానికి సంబంధించింది కాదు. షేర్‌హోల్డర్లకు (Share Holders) దీర్ఘకాలిక లాభం అందించేందుకు, మా పోర్ట్‌ఫోలియోను పునఃసమీక్షించే నిర్ణయం తీసుకున్నాం..” అన్నారు.
క్రిక్‌బజ్ రిపోర్టుల ప్రకారం ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేయడానికి పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
వాటిలో అమెరికాలోని ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అదానీ గ్రూప్, జిందాల్ గ్రూప్, అదర్ పూనావాలా, రవి జైపూరియా వంటి వ్యాపారవేత్తలు ఉన్నారని సమాచారం.
ఈ ఏడాది జూన్ 4న బెంగళూరులోని చినస్వామి స్టేడియం బయట జరిగిన దుర్ఘటనలో 11 మంది అభిమానులు మరణించడంతో ఆర్సీబీ నిర్వహణపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
అదే సమయంలో షేర్‌హోల్డర్లు కూడా “నాన్-కోర్ వ్యాపారాలు విడిచిపెట్టండి” అంటూ డయాజియోపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో కంపెనీ ఒక మర్చంట్ బ్యాంక్‌ను నియమించి విక్రయ ప్రక్రియ పర్యవేక్షణ ప్రారంభించింది. అంచనా ప్రకారం, 2026 మార్చి నాటికి కొత్త యాజమాన్యం ఆర్సీబీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
దీంతో ఐపీఎల్ 2026 సీజన్ నుంచి కొత్త యజమానులు అధికారికంగా ఆరంగేట్రం చేయవచ్చు. అదేవిధంగా, ఆర్సీబీకి చెందిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premier League – WPL) జట్టుపై కూడా ఈ విక్రయ ప్రభావం పడే అవకాశం ఉంది.
