అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్‌లో మరో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలో ఇటీవల హత్యలు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి రౌడీ షీటర్‌ను (rowdy sheeter) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. షాహీన్ నగర్లో అమెర్ (32) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అమెర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ షిగర్ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad | వరుస ఘటనలతో కలవరం
నగరంలో ఇటీవల వరుసగా హత్యలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు కలవర పడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. నేరాలు ఆగడం లేదు. ఎక్కువగా రౌడీ షీటర్లపై దాడులు జరుగుతుండటం గమనార్హం. నగరంలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఇటీవల ఓ రియల్టర్‌ను దుండగులు హత్య చేశారు. రియల్టర్ వెంకటరత్నం స్కూటీపై వెళ్తుండగా.. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ స్కూల్సమీపంలోకి రాగానే అతడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై షూట్ చేశారు. అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ (Rain Bazaar Police Station) పరిధిలో సైతం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ జునైద్ (30)ను దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.