అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ధరణి సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి చట్టాన్ని తెచ్చామన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ఖమ్మం కలెక్టరేట్లో (Khammam Collectorate) మంత్రి లైసెన్స్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సర్వే కోసం గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా ‘రోవర్స్’ సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేశామన్నారు.
Minister Ponguleti | ధరణిపై ఆడిట్
ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. త్వరలోనే మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు. ధరణి లొసుగులతోనే ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము పక్కదారి పట్టిందని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టమని హెచ్చరించారు. అక్రమాల నుంచి రైతులు, భూ యజమానులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా భూ భారతి పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి అప్పగించామని తెలిపారు.