అక్షరటుడే, కామారెడ్డి: Solar Panels | ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు తదితర అన్ని ప్రభుత్వ ఆస్తుల వివరాలను అందజేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో సోమవారం విద్యుత్, రెడ్కో శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇంజినీరింగ్ శాఖల కార్యాలయాలు, ఆస్పత్రులు, అంగన్వాడీలను మండల స్థాయిలో ఎంపీడీవో, విద్యుత్ శాఖ ఏఈలు (electricity department AEs) మండలంలో గల అన్ని ప్రభుత్వ ఆస్తులను సందర్శించాలన్నారు. ఆయా సంస్థల భవనాలపై ఎండ పడే ప్రాంతాలను జాగ్రత్తగా కొలిచి వాటి వివరాలను సేకరించాలని సూచించారు. అదేవిధంగా ఆయా కార్యాలయాలు సంస్థలలో విద్యుత్ వినియోగం వివరాలను సేకరించి త్వరగా అందించాలని విద్యుత్ ఎస్ఈ శ్రవణ్ కుమార్ను ఆదేశించారు.