అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | ప్రస్తుతం టీమిండియాలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వన్డే, టెస్ట్‌ల నుండి రోహిత్, కోహ్లీ తప్పుకోవడంతో వారి స్థానాలలో కొత్త కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక రోకో కేవలం వన్డేలకి మాత్రమే పరిమితం కాగా, వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం భారత జట్టులో వన్డే ఫార్మాట్‌కు రోహిత్ శర్మ కెప్టెన్(Rohit Sharma Captain)గా ఉన్నప్పటికీ, అతని భవిష్యత్‌పై అనేక చర్చలు, ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కారణం అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్(Shubhman Gill) చూపించిన అద్భుత నాయకత్వం. అతని కెప్టెన్సీలో భారత జట్టు సిరీస్‌ను సమం చేయడమే కాక, యువతలో క్రికెట్‌పై నమ్మకాన్ని పెంచింది.
BCCI | ఎక్కువవుతున్న ప్రెజర్..
ప్రస్తుతం టీమిండియా(Team India)లో మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉన్న విషయం తెలిసిందే.వన్డేలకి రోహిత్ శర్మ, టెస్టులకి శుభ్‌మన్ గిల్, టీ20లకి సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. రోహిత్ ఇప్పటికే టెస్ట్, టీ20ల నుంచి వైదొలిగాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్ లీడర్ షిప్‌ని కూడా యువతకి అప్పగించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రోహిత్ శర్మ మాత్రం వన్డేల్లో 2027 వరల్డ్ కప్ వరకూ కొనసాగాలని భావిస్తున్నాడు. అదే అభిప్రాయాన్ని విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా పంచుకుంటున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీతో ఇద్దరూ తమ అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
2026 చివరి వరకు భారత్.. 27 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడనుండగా, రోహిత్, కోహ్లీకి మంచి సమయం దొరుకుతుంది.. అటు ఫిట్ నెస్ పరంగా వారిద్దరు ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా తక్కువ. ఆడిన ప్రతి మ్యాచ్ లో పూర్తి కమిట్మెంట్ చూపారనడంలో సందేహాలు అక్కర్లేదు. అయితే వన్డేల్లో కొనసాగాలంటే బీసీసీఐ(BCCI) కొన్ని కండీషన్లు పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా 2027 వరల్డ్ కప్‌కు ఎంపిక అవ్వాలంటే, రోహిత్-కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పనిసరిగా ఆడాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ 2025–26 సీజన్ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఇది భారతదేశంలో డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్(Domestic ODI Tournament)గా పేరుపొందింది. కానీ, రోహిత్, కోహ్లీ ఇద్దరూ గత కొంతకాలంగా డొమెస్టిక్ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీసీసీఐ కండీషన్లను వారు ఎలా స్వీకరిస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు గిల్, సూర్యకుమార్ లాంటి కొత్త నాయకులు తమ సత్తా చాటుతుండగా… మరోవైపు రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు తమ చివరి లక్ష్యంగా 2027 వరల్డ్ కప్‌ను నిర్దేశించుకున్నారు.