అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RO-KO Test Retirement | ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెట్టిన ఘటనల్లో ఒకటి రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లు. ఇద్దరు లెజెండ్స్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు అభిమానులు కొంత నిరాశ చెందినా, భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయంగా అర్థం చేసుకున్నారు.
అయితే కీలకమైన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు ఉన్నట్లుండి ఇద్దరూ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా షాక్ వేవ్ ఏర్పడింది. ఈ నిర్ణయంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వినిపించగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా కీలక ప్రశ్నలు లేవనెత్తాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఉతప్ప, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగిన తీరు నేచురల్‌గా అనిపించలేదని వ్యాఖ్యానించాడు.
RO-KO Test Retirement | ఎన్నో అనుమానాలు..
ఈ నిర్ణయం తీసుకున్న సమయం అనుమానాలకు తావిస్తోందని, పూర్తి నిజం రోహిత్, విరాట్లకే తెలుసని చెప్పాడు Robin uthappa. “ఇది బలవంతంగా జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ బయట నుంచి చూస్తే మాత్రం ఇది సహజమైన ఎగ్జిట్లా అనిపించలేదు. భవిష్యత్‌లో వారు తమ నిర్ణయాన్ని వివరించే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికి ఇది అసాధారణంగా కనిపిస్తోంది” అని ఉతప్ప స్పష్టం చేశాడు. 2024లో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్, కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వెల్లడించారు. అనంతరం 2025 మే నెలలో ఇద్దరూ టెస్ట్ రిటైర్మెంట్లను ప్రకటించడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఇంటర్నేషనల్స్ (One Day Internationals)లో మాత్రమే కొనసాగుతుండగా, 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం.
ఈ నిర్ణయాల టైమింగ్‌పై కూడా ఉతప్ప ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్–గవాస్కర్ ట్రోఫీని టీమ్ ఇండియా (Team India) కోల్పోయిన తర్వాతే రిటైర్మెంట్లు రావడం ప్రశ్నలను లేవనెత్తిందని పేర్కొన్నాడు. ఆ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డప్పటికీ, తర్వాత డొమెస్టిక్ క్రికెట్‌కు తిరిగి వచ్చి రంజీ ట్రోఫీలో ఆడటం టెస్ట్ క్రికెట్ కొనసాగించాలనే వారి ఉద్దేశాన్ని సూచించిందని ఉతప్ప గుర్తుచేశాడు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని నెలలకే టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచిందన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమించడం కూడా చర్చకు దారి తీసింది. రోహిత్ శర్మ ఫామ్, ఫిట్‌నెస్‌పై వచ్చిన విమర్శలను ఉతప్ప ఖండించాడు. ఆస్ట్రేలియాలో రోహిత్ బాగా ఆడకపోయినా, అతను తిరిగి పుంజుకుంటాడనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. “ఆ సమయంలో రోహిత్ కొంత విరామం తీసుకుని ఫిట్‌నెస్‌పై పనిచేస్తే సరిపోతుంది అనుకున్నాను. అతనిలో పరుగులు చేయలేని సామర్థ్యం లేదని ఎప్పుడూ అనిపించలేదు” అని వ్యాఖ్యానించాడు.