అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ms Dhoni | మహేంద్ర సింగ్ ధోనీ… ఈ పేరు వినగానే చాలు క్రికెట్ అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏదో ఒక ఫార్మాట్లో అయినా సరే మాహీని మళ్లీ చూడాలని కోరుకునేవాళ్లు కొందరైతే… ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ కనిపిస్తే చాలు అనుకునేవాళ్లు మరికొందరు.
అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ (IPL Season) చివర్లో మాత్రం అభిమానుల మనసుల్లో ఒకే ప్రశ్న—ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ సీజనా అని ?వయసు పెరుగుతున్నా, మోకాళ్ల నొప్పి వేధిస్తున్నా, వికెట్ల మధ్య పరుగులు తీయడం కష్టమవుతున్నా… అభిమానుల కోసం ప్రతి ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు ధోనీ. భారీ షాట్లు కొట్టాలన్నా, క్షణాల్లో స్టంప్స్ ఎగరేయాలన్నా మాహీ స్టైల్‌కే సాటి లేదు. బ్యాటింగ్‌కి రాకపోయినా పర్వాలేదు… జట్టులో ఉంటే చాలు అన్న భావన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులలోనే కాదు, క్రికెట్ ప్రపంచమంతా కనిపిస్తుంది.
Ms Dhoni | ఇదే చివరిదా?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి ఇప్పుడు సీఎస్కే అభిమానులను ఆలోచనలో పడేశాయి. రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. “పరిస్థితులను బట్టి చూస్తే ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరిది అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతి సీజన్లో అతడు ఆడతాడని నేను అనుకోవడం లేదు” అని చెప్పాడు. సీఎస్కే ఫ్రాంచైజీ తాజా వ్యూహాన్ని కూడా ప్రస్తావించాడు. “ఇటీవలి ఐపీఎల్ మినీ వేలాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఎక్కువగా యువ క్రికెటర్లపై ఇన్వెస్ట్ చేస్తోంది. గత ఏడాది కూడా అదే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లను కీలకంగా తయారు చేస్తోంది. ఇది ధోనీ ఇక ఎక్కువ సీజన్లు ఆడకపోవచ్చనే సంకేతంగా భావించొచ్చు” అని అన్నాడు.
అయితే ధోనీ పూర్తిగా సీఎస్కే నుంచి తప్పుకుంటాడని మాత్రం ఉతప్ప అనుకోవడం లేదు. “ధోనీ ఆటగాడిగా కాకపోయినా, సీఎస్కేకు మెంటార్‌గా కొనసాగుతాడు. వచ్చే సీజన్లోనే ప్లేయర్ కమ్ మెంటార్ పాత్రలో కనిపించవచ్చు. అతడు ఆలోచించే విధానం కూడా అదే దిశగా కనిపిస్తోంది” అని ఉతప్ప వ్యాఖ్యానించాడు.ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో… ధోనీ నిజంగానే ఐపీఎల్‌కు వీడ్కోలు పలకబోతున్నాడా? 2026 సీజన్లో చివరిసారిగా మాహీని సీఎస్కే జెర్సీలో చూడబోతున్నామా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మరింత బలంగా వినిపిస్తున్నాయి.