Homeక్రైంVisakha Express | విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీకి య‌త్నం.. ఫైరింగ్ చేయ‌డంతో పారిపోయిన దొంగ‌లు

Visakha Express | విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీకి య‌త్నం.. ఫైరింగ్ చేయ‌డంతో పారిపోయిన దొంగ‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakha Express | ఈ మధ్య రైళ్లలో దొంగ‌త‌నాలు జ‌రుగుతుండ‌డం ప్ర‌యాణికుల‌ను భ‌యబ్రాంతుల‌కు గురి చేస్తుంది. రాత్రి ప‌డుకున్న స‌మ‌యంలో దొంగ‌లు రైళ్ల‌లోకి చొర‌బ‌డి అందిన‌కాడికి దోచుకొని పోతున్నారు. తాజాగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (Visakha Express)లో భారీ చోరీకి యత్నించిన దుండగుల గ్యాంగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కాల్పులు జరపడంతో దుండగులు తప్పించుకొని అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. న్యూపిడుగురాళ్ల స్టేషన్ (New Piduguralla Station) సమీపంలో సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేసి మ‌రీ వారు రైల్లోకి ప్ర‌వేశించడం గమనార్హం.

Visakha Express | వ‌రుస దొంగ‌త‌నాలు..

రైల్వే పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో దుండగులు రైలు నుంచి దూకి తప్పించుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠా రైల్లోకి ఎక్కినట్టు పోలీసులు స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల వ్యవధిలో న్యూపిడుగురాళ్ల స్టేషన్‌లో జరిగిన రెండో ఘటన ఇది కాగా, ప్ర‌యాణికులు ఆ రూట్‌లో ప్ర‌యాణించాలంటేనే జంకుతున్నారు. ఇటీవల కాలంలో బీహార్ (Bihar), మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన గ్యాంగులు రైళ్లలో వరుసగా చోరీకి పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రయాణికుల వద్ద విలువైన వస్తువులు, నగదు లూటీ చేయాలనే ఉద్దేశంతో వీరు రాత్రివేళల్లో ఈ దాడులు జరుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. “ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదు. వారి ర‌క్ష‌ణ కోసం రాత్రివేళల్లో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను మోహరించాం,” అని పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. పల్నాడు (Palnadu) అటవీ ప్రాంతంలోకి పారిపోయిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లు, రైల్వే పోలీసుల మధ్య సమన్వయంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ గ్యాంగులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ల సహాయంతో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో రైళ్లలో భద్రత పట్ల మరోసారి ప్రశ్నలు తలెత్తగా, పోలీసులు వెంట‌నే స్పందించిన తీరు ప్రయాణికులకు కాస్త ధైర్యం కలిగిస్తోంది.