అక్షరటుడే, వెబ్డెస్క్ : Road Accidents | రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదాలో (Road accidents) చోటు చేసుకున్నాయి.
ఎంతో మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ద్విచక్ర వాహనాల నుంచి మొదలుకొని ఆర్టీసీ బస్సుల (RTC bus) వరకు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొని 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలపై కథనం..
రాష్ట్రంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో సగటున ప్రతి రెండు గంటలకు ఒకరు మృతి చెందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 6,417 కిలో మీటర్ల మేర రహదారులు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 7,333 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో (national and state highways) ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 2,702 మంది చనిపోగా.. 8,118 మంది గాయపడ్డారు.
Road Accidents | అతివేగంతో..
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్. చాలా మంది వాహనదారులు అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అతివేగంతో 4,717, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 3,562 చోటు చేసుకున్నాయి. డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు 117, రాంగ్ రూట్ డ్రైవింగ్ 228, సిగ్నల్ జంపింగ్ (signal jumping) కారణంగా మూడు ప్రమాదాలు, ఫోన్ వాడుతూ వాహనం నడపడంతో మూడు యాక్సిడెంట్లు అయ్యాయి.
Road Accidents | ఆ వాహనాలే అధికం
ఎక్కువగా కార్లు, ద్విచక్ర వాహనాలే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది 2,432 కార్లు, జీపులు, 2,426 ద్విచక్ర వాహనాలు, 1,589 లారీలు, 511 బస్సులు, 461 ఆటోలు, 77 భారీ వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరుతున్నారు.
