అక్షరటుడే, వెబ్డెస్క్ : Kurnool District | కర్నూలు జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గ (Emmiganur constituency) పరిధిలోని కొటేకల్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఢీకొన్న కారులో నలుగురు మృతదేహాలు పూర్తిగా ఇరుక్కుపోవడంతో, తీవ్రంగా శ్రమించి వాటిని బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Kurnool District | మృతులు కర్ణాటకవాసులు
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు కర్ణాటకలోని (Karnataka) కోలార్ జిల్లా చిన్న హోసపల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. బాధితులు తమ బంధువుల ఇంటికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసు శాఖ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి అతి వేగం, అజాగ్రత్త కారణమా లేకుంటే రోడ్డు పరిస్థితులు కారణమా అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇదే రోజు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ సమీపంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న రైతు రామకృష్ణను Rama Krishna బైక్ ఢీకొట్టడంతో, ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతుడు తెర్నేకల్ గ్రామానికి చెందిన రైతు. పత్తి పంటను అమ్మడానికి మార్కెట్‌కు వచ్చిన ఆయన ఇలా ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇటీవల కర్నూలు–చిత్తూరు హైవేపై (Kurnool-Chittoor highway) ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ (Hyderabad) నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టగా, దాని వెంటనే వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఆగిన బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. పదిమంది వరకు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో గాయాలు తీవ్రమయ్యాయి. స్థానికులు, పోలీసులు కలిసి అతన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం కర్నూలు సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మంటలు చెలరేగి 19మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
