అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్ఎంపీ మృతి చెందాడు. ఈ ఘటన కంజర గ్రామం (Kanjara Village) వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మోపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం (Mopal Mandal) నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన వెల్దుర్కి గంగాధర్(53) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు.
అయితే శనివారం అర్ధరాత్రి తర్వాత కంజర గ్రామం సమీపంలోని రెసిడెన్షియల్ స్కూల్ వద్ద చెట్ల మధ్య పొదల్లో ఓ వ్యక్తి పడి ఉన్నాడని స్కూల్ వాచ్‌మన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని వెల్దుర్కి గంగాధర్‌గా గుర్తించారు.
కానీ అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతుడి కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెంది ఉంటాడా.. లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.