అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kharif Season | ఖరీఫ్ సీజన్ మొదట్లో మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. వాన జాడ లేకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచి పోయాయి. ఇప్పటికే వేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. భారీ వర్షాలు (Heavy Rains) లేకపోవడంతో తెలంగాణలో నాట్లు వేసే పనులు సగటు కంటే తక్కువగానే పూర్తయ్యాయి.
వారం, పది రోజులుగా వానజల్లుల జాడ కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదు కావడంతో రైతాంగం (Farmers) తీవ్ర ఆందోళన చెందుతోంది. ఉమ్మడి 10 జిల్లాల్లో సగటు వర్షం తక్కువగా కురవడంతో ఖరీఫ్ వ్యవసాయ అవకాశాలు, ముఖ్యంగా వరి సాగుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జులై 9 నాటికి మొత్తం నాట్లు వేసే కార్యకలాపాలు కాలానుగుణనంగా సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
Kharif Season | సగటు కంటే తక్కువ..
ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్(Kharif Season) ఆరంభానికి ముందే వర్షాలు కురిశాయి. తుఫాన్ ప్రభావంతో ఎండకాలం చివరిలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో కృష్ణ నదికి వరదలు వచ్చాయి. అయితే, రుతుపవనాల ఆగమనం తర్వాత దంచికొట్టాల్సిన వానలు ముఖం చాటేశాయి. అడపా దడపా కురిసిన జల్లులు.. వారం, పది రోజుల నుంచి జాడే లేకుండా పోయాయి. అన్ని జిల్లాల్లోనూ సగటు వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది.
తెలంగాణ(Telangana)లో సాధారణంగా 185.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 165.5 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక, తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. జూన్ 1 నుంచి జూలై 9 మధ్య రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 185.4 మి.మీ.కు వ్యతిరేకంగా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత వారం నుంచి కనీసం జల్లులు కూడా లేకుండా పోయాయి. సాధారణ వర్షపాతం 45.4 మి.మీ.తో పోలిస్తే కేవలం 27.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 39 శాతం తక్కువ.
Kharif Season | 42 శాతమే సాగు..
నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని వర్షాలు పెద్దగా కురియలేదు. మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మేడ్చల్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ సహా అన్ని జిల్లాలలో వర్షపాతం తక్కువగా నమోదైంది. దీని ప్రభావం సాగురంగంపై భారీగానే పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42.48% మాత్రమే సాగు పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేక ప్రధానంగా వరి నాట్లకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొంటున్నారు. సాధారణ ఖరీఫ్‌లో 132.44 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతుండగా, జూలై 9 నాటికి 56.26 లక్షల (42.48 శాతం). ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేయడం పూర్తయింది.
Kharif Season | నాట్లు అంతంతే..
ఖరీఫ్ సీజన్‌లో కీలకమైన వరి సాగు అత్యంత దారుణంగా దెబ్బతింది. ఇప్పటివరకు 5.01 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌కు సాధారణంగా 62.48 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటిదాకా కేవలం 8.02 శాతం మాత్రమే పూర్తయింది.
ఉలవలు, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి ఇతర ప్రధాన పంటలు కూడా వాటి సాధారణ విస్తీర్ణంలో 25 శాతం కంటే తక్కువగా సాగయ్యాయి. అయితే, పత్తి, మొక్కజొన్న, పసుపు సాగు మాత్రం ఆశాజనంగానే ఉంది. అధికారుల అంచనాలకు మించి మొక్కజొన్న సాగు అధికంగా సాగు చేశారు. ఖరీఫ్‌లో 5.21 లక్షల ఎకరాల్లో మక్క సాగవుతుందని అంచనా వేయగా, 5.34 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇది సాధారణ లక్ష్యంలో 102.52 శాతం సాధించింది. పత్తి విత్తనాలు కూడా గణనీయమైన పురోగతి సాధించాయి. అంచనా వేసిన 48.93 లక్షల ఎకరాల్లో 36.30 లక్షల ఎకరాల్లో 74.21 శాతం మేర విత్తనాలు వేయడం పూర్తయింది.