అక్షరటుడే, ఎల్లారెడ్డి : BC Declaration | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సందర్భంగా కామారెడ్డిలో 15న సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో (Minister Quarters) మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు (MLA Madan Mohan Rao) సైతం పాల్గొన్నారు. సభ నిర్వహణపై సమాలోచనలు చేశారు.
ఎన్నికల ముందు కామారెడ్డిలో (Kamareddy) ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీసీ కుల గణనపై ఇచ్చిన హామీని నెరవేర్చామని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నేతృత్వంలో హామీ అమలుకు కృషి చేశామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికి కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు.
అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తూ అసెంబ్లీ తీర్మానిస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Modi Government) అడ్డుకుంటోందని వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే ప్రతిష్టాత్మక బహిరంగ సభను విజయవంతం చేయడానికి అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో చర్చించామని వారు పేర్కొన్నారు.