HomeతెలంగాణACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా.. లంచాలు తీసుకుంటున్నారు.

ఏసీబీ అధికారులు (ACB Officers) ఇటీవల నిత్యం దాడులు చేపడుతున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను డబ్బులు అడుగుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా రెవెన్యు ఇన్​స్పెక్టర్​ (RI) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ACB Trap | భూమి నమోదు చేయడానికి..

నారాయణపేట (Narayanpet) జిల్లా మద్దూరు రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ అమర్నాథ్ రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన కబ్జా (స్వాధీనం)లో ఉన్న భూమిని పట్టా పాస్​బుక్​లో నమోదు చేయాలని ఆర్​ఐని కలిశాడు. సదరు భూమిని పాస్​బుక్​లో చేర్చడానికి ధ్రువీకరణ నివేదికను సమర్పించడానికి లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధిత రైతు కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రైతు నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటుండగా.. ఆర్​ఐ అమర్నాథ్​రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేశారు.

ACB Trap | జోరుగా అవినీతి

రెవెన్యూ శాఖలో అవినీతి జోరుగా సాగుతోంది. పలు తహశీల్దార్​ కార్యాలయాల్లో (Tahsildar’s office) పైసలు ఇస్తేనే పనులు సాగుతాయి. పలువురు అటెండర్​, ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు తహశీల్దార్లు ఆపరేటర్లు, కింది స్థాయి సిబ్బందితో డబ్బులు వసూలు చేయిస్తున్నారు. అయినా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ కోసం కూడా కొందరు అధికారులు డబ్బులు అడుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ACB Trap | లంచం ఇవ్వొద్దు

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.