అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తూనే ఉన్నారు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదంటే పనులు చేయడం లేదు. నిత్యం ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (Revenue inspector) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాల సుబ్రహ్మణ్యం కల్యాణ లక్ష్మి (Kalyana Laxmi) చెక్కు కోసం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. రూ.నాలుగు వేలు ఇస్తేనే దరఖాస్తును ఆమోదిస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం రూ.నాలుగు వేల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యంను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
ACB Trap | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) కోసం కూడా కొంతమంది అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం చాలా కార్యాలయాల్లో రూ.వేయి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో సైతం రూ. వెయ్యి ఇస్తేనే దరఖాస్తును ఆమోదిస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి దగ్గర సైతం అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు. ఆపరేటర్లు, అటెండర్ల సాయంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. లంచం ఇవ్వకపోతే రేపు మాపు అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.
ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.