అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda Congress | నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో (Nalgonda Congress) అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గాల మధ్య పాత మనస్పర్థలు మరోసారి ఉధృతమవుతున్నాయి.
తాజాగా.. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి భర్తీ నేపథ్యంలో ఈ విభేదాలు ఎత్తున బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్ష పదవి దక్కనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గుమ్ముల మోహన్ రెడ్డి, తనకు జరిగిన అన్యాయం గురించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “కోమటిరెడ్డి అనుచరుడిననే నాకు పదవి రాలేదు” అంటూ మోహన్ రెడ్డి (Mohan Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
Nalgonda Congress | వర్గ పోరు..
తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అనుచరుడిగా ఉండడం వల్లే రేవంత్ వర్గం నుంచి తనపై కక్ష కట్టిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రూప్‌కు సమీపమైనవారికి మాత్రమే పదవులు వచ్చాయని, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కనబెడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని 75 శాతం మంది తమ పేరును సూచించినా, చివరి జాబితాలో తన పేరు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడానికి తన కులమే కారణమైందని మోహన్ రెడ్డి మరో పెద్ద ఆరోపణ చేశారు. పార్టీ కార్యక్రమాలు ఏవైనా పిలవగానే ముందుండి నిబద్ధతతో పనిచేసినా తనకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నవ్వుతూ గొంతు కోశారు… ముందే చెబితే బాగుండేది” అంటూ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో పెను చర్చలకు దారితీశాయి. “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నా భుజం మీద చెయ్యి పెట్టినప్పుడు మంచి రోజులు వస్తాయని అనుకున్నాను. కానీ నవ్వుతూ గొంతు కోస్తారనుకోలేదు. డీసీసీ పదవి ఇవ్వమని ముందే చెప్పి ఉంటే ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తర్వాత పార్టీలో చేరిన 20 మందికి కూడా కార్పొరేషన్ పదవులు వచ్చాయని, కానీ తనకైతే రెండు సంవత్సరాలుగా హామీలు తప్ప ఏమీ రాలేదని మండిపడ్డారు. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు (Congress Leaders) చెబుతున్నది ఏమిటంటే ..మోహన్ రెడ్డి ఎదగకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్దే అడ్డుపడ్డారు, తన కింద ఎవరూ ఎదగనివ్వని కోమటిరెడ్డి స్వభావమే దీనికి కారణమని, అందుకే మోహన్ రెడ్డి పేరు చివరి నిమిషంలో డ్రాప్ అయ్యిందని అంటున్నారు.
