అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్ హాట్‌గా సాగనున్నాయి. దూకుడైన నేతగా పేరొందిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అధికార పక్షాన్ని నడిపిస్తుండగా.. వ్యూహాల్లో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రతిపక్ష నేతగా సభలో పాల్గొననున్నారు. తొలి బడ్జెట్ సమావేశాల్లో కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైన కేసీఆర్, ఇప్పుడు శాసనసభ చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) చెబుతుండడంతో ఈ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Telangana Assembly | వాటర్ వార్..
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య జరిగిన చర్చలు రాజకీయంగా ఎంతో ఉత్కంఠభరితంగా ఉండేవి. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత ఆ స్థాయి వాగ్యుద్ధాలు అసెంబ్లీలో పెద్దగా కనిపించలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ సమావేశాలు సాధారణంగానే సాగేవి. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ సభకు రాకపోవడంతో సమావేశాలు పెద్దగా ఆకర్షణీయంగా లేకపోయాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
శాసనసభ సమావేశాలకు పక్కా వ్యూహంతో కేసీఆర్ సిద్ధమయ్యారని సమాచారం. ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన, తెలంగాణకు నీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. అదే అంశాలను అసెంబ్లీ వేదికగా తీసుకెళ్లి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కృష్ణా నదీ ప్రాజెక్టులను కేంద్ర బోర్డుకు అప్పగించడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు వంటి అంశాలపై కేసీఆర్ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90.81 టీఎంసీల నికర కేటాయింపులతో ఈ ప్రాజెక్టును రూపొందించామని, భవిష్యత్తులో దాన్ని 170 టీఎంసీలకు పెంచాలన్నదే తమ వ్యూహమని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. దాదాపు రూ.27 వేల కోట్ల ఖర్చుతో 88 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పూర్తి విషయంలో జాప్యం జరుగుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పూర్తి వ్యూహంతో సిద్ధమవుతున్నారు. ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని రేవంత్ ఇప్పటికే సవాల్ విసిరారు. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై, బీఆర్ఎస్ ఏ కోణంలో ప్రశ్నలు సంధించవచ్చో, వాటికి ఎలా సమాధానం ఇవ్వాలో పూర్తి స్థాయిలో చర్చించినట్లు సమాచారం. తెలంగాణకు 512 టీఎంసీలు రావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ వాదనగా ఉండనుంది. పాలమూరు ప్రాజెక్టుకు జూరాల నుంచి నీరు తీసుకోకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని.. ఇది కమీషన్ల కోసమే జరిగిందన్న ఆరోపణలను కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రస్తావించనున్నారు. మొత్తానికి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా సాగనున్నాయి