అక్షరటుడే, వెబ్‌డెస్క్ :CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పాలనపై పట్టు పెంచుకుని ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటూ, సొంత పార్టీలోని అసమ్మతిని అధిగమిస్తూ తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ, ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయిన కీలక అంశాలను సైతం పట్టాలెక్కించి రేవంత్‌రెడ్డి మంచి మార్కులు తెచ్చుకున్నారు. ప్రధానంగా బీసీల రిజర్వేషన్ల(BC Reservations) విషయంలో పట్టుదలతో వ్యవహరించిన ఆయన.. ఆయా సామాజిక వర్గాల మద్దతును కూడగట్టుకుంటున్నారు. మొత్తంగా గత పాలకులకు భిన్నంగా వ్యవహరిస్తూ, రాష్ట్ర రాజకీయ యవనికపై బలమైన ముద్ర వేసుకుంటున్నారు.
CM Revanth Reddy | ఎంపీటీసీ నుంచి సీఎం దాకా..
ఎక్కడో నల్లమల ప్రాంతంలో పుట్టి పెరిగిన రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఎదిగిన తీరు స్ఫూర్తిదాయంగా నిలుస్తుంది. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకుడిగా బీజేపీ వారసత్వాన్ని అందుకున్న రేవంత్‌రెడ్డి.. ఇండిపెండెంట్‌గా ఎంపీటీసీ అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ గూటికి చేరి అతి స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఎంపీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో పని చేసిన ఆయన అశేష అనుభవం గడించారు. ఆ అనుభవంతోనే బలమైన బీఆర్ఎస్‌ను మట్టి కరిపించారు. కేసీఆర్(KCR) వంటి నాయకుడికి సమ ఉజ్జిగా నిలిచి అనూహ్యంగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు.
CM Revanth Reddy | పాలనపైన, ప్రత్యర్థులపైనా పట్టు..
కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం పదవిపై కన్నేసిన మిగతా నాయకులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి నాళ్లలో కొంత మంది సీనియర్ల సహాయక నిరాకరణను సైతం అధిగమిస్తూ పాలనపై పట్టు పెంచుకున్నారు. అధికారం కోల్పోయినప్పటికీ, కొంత మంది అధికారుల సాయంతో ప్రభుత్వంలో బీఆర్ఎస్(BRS) హవా కొనసాగుతుండడాన్ని గుర్తించి, ఆయా అధికారులను చెక్ పెట్టారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని అస్థిరం చేసే బీఆర్ఎస్ ప్రయత్నాలను తిప్పికొట్టి, ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. మరోవైపు, అన్ని విధాలుగా ఎదురుదాడి చేస్తున్న గులాబీ పార్టీని.. పదేళ్ల పాలనలోని అక్రమాలపై విచారణకు ఆదేశించడం ద్వారా డిఫెన్స్‌లోకి నెట్టేశారు. రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తూ, తనదైన శైలిలో పదునైన విమర్శలతో ప్రతి దాడికి దిగి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటామని చెబుతూనే, బీజేపీ(BJP)తో ఢీ అంటే ఢీ అంటున్నారు. అంతర్గత, ఆధిపత్య పోరుకు మారుపేరుగా చెప్పుకునే కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఎదిగి, అసంతృప్త నేతలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు.
CM Revanth Reddy | కీలక నిర్ణయాలతో బలమైన ముద్ర..
ఆరు గ్యారంటీలు అమలు చేయలేక రేవంత్ సర్కారు(Revanth Government) తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హైడ్రా వంటి కొన్ని నిర్ణయాలతో ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. రుణమాఫీ సంపూర్ణంగా చేయలేక, రెండుసార్లు రైతుభరోసా(Rythu Bharosa) ఇవ్వలేక రైతాంగంలోనూ చెడ్డపేరు తెచ్చుకుంది. అయితే, పాలనలో స్థిరత్వం పెంచుకోవడంతో పాటు ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. రైతుభరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను ఖాతాల్లో వేసి రైతులను సంతోషపరిచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆ వర్గాలకు దగ్గరయ్యారు. ఇక, రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉండే బీసీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుని, ఆయా సామాజికవర్గాల మెప్పు పొందారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటకు కట్టుబడి, ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు దేశంలో తొలిసారి కుల గణన నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణను ప్రత్యేక ఘనత తీసుకొచ్చారు. అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకుంటూ పాలనను కొనసాగిస్తున్నారు. 60 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి తెచ్చుకున్నారు. ఇలా ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తున్న రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు.