అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసు (Formula E Race) కేసులో ఆయనను సోమవారం ఏసీబీ (ACB) విచారించిన విషయం తెలిసిందే. తొమ్మిది గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించారు.
ఏసీబీ విచారణ అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు. చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలే ఏసీబీ అధికారులు అడిగారన్నారు. ఇది ఒక లొట్ట పీసు కేసు అని.. రేవంత్‌రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ములేదని విమర్శించారు.
KTR | అసెంబ్లీ చర్చ పెట్టమంటే పారిపోయారు
ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పారిపోయిందని కేటీఆర్ అన్నారు. లై డిటెక్టర్ పెట్టమంటే మళ్లీ పారిపోయారన్నారు. ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా కూడా పోలేదని ఆయన పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఉదయం నుంచి ఒక్కటే ప్రశ్న తిప్పి తిప్పి అడిగారన్నారు.
KTR | జైలులో పెడితే రెస్ట్ తీసుకుంటా..
తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని రోజులు జైలులో ఉన్నారని, తమను కూడా జైలులో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తనను జైలులో పెడితే 15 రోజులు రెస్ట్ తీసుకుంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ప్రతిష్టను పెంచేలా పని చేశామన్నారు. కాళేశ్వరం అయినా ఫార్ములా ఈ కారు రేసు అయినా తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశామన్నారు. తన మీద 14 కేసులు పెట్టారని, మరో 1400 కేసులు పెట్టినా భయపడనన్నారు.
KTR | స్థానిక ఎన్నికల ఫోకస్ పెట్టాలి
కార్యకర్తలు, నాయకులు స్థానిక ఎన్నికల మీద దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ నాయకులను చిత్తుగా ఓడించాలని ఆయన సూచించారు. జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్ జాతికి అంకితం చేశారని, ఆ రోజున పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.