అక్షరటుడే, గాంధారి: Harish Rao | ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రజినీకాంత్‌గా, అయిన తర్వాత గజినీకాంత్‌గా మారారని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ‘మీ కష్టాన్ని కళ్లారా చూద్దామని వచ్చిన.. మీకోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా..’ అని సీఎం చెప్పారని.. కానీ వరద బాధితులకు చేసింది గుండు సున్నా వ్యాఖ్యనించారు. గాంధారి (Gandhari) మండల కేంద్రంలోని హరాలే గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
Harish Rao | అధికారంలోకి రాగానే పన్నులు వేశారు..
అధికారంలోకి రాగానే ప్రజలపై పన్నుల భారం మోపిన ఘనత సీఎం రేవంత్‌కే (CM Revanth Reddy) దక్కిందన్నారు. మద్యం, విత్తనాలు, ఆర్టీసీఛార్జీలు.. ఇలా ప్రతిదానిపై ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారికి ఉపయోగపడే న్యూట్రీషియన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు బంద్ చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా బీఆర్‌ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరముందని, అయితేనే, తెలంగాణకు రావాల్సిన నీటి వాటా అందుతుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 చొప్పున రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.55వేలు బాకీ పడిందన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని రైతులను మభ్యపెట్టేందుకు రైతుబంధు వేశాడని, ఇందులోనూ కౌలు రైతుకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకునుడు తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఫలితాలు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియామక పత్రాలు అందించి గొప్పలకు పోతున్నాడని, గత ప్రభుత్వ హయాంలో నిలిచిన ప్రతి పనిని తానే చేస్తున్నానని రిబ్బన్ కటింగ్ చేయడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ గెలవడం ఖాయమన్నారు.
Harish Rao | పైసల్లేవని రాష్ట్రం పరువు తీస్తున్నాడు..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవని చెబుతూ రాష్ట్రం పరువు తీసే ముఖ్యమంత్రి రేవంత్ మనకు అవసరమా అని అన్నారు. బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు ఇచ్చేందుకు ధైర్యం కాలేదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరద విపత్తు సాయం కింద నిధులు అందిస్తామని చెప్పి చేసిందేమీ లేదన్నారు.
కానీ మూసి నది కోసం రూ.లక్షన్నర కోట్లు పెట్టి ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అంటూ, రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారన్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డికి తెలిసిపోయిందని.. అందుకే ప్రజలకు ఎంత చేసినా.. దండగ అనుకుని తనకు వాటాలు వచ్చే దాంట్లో రూ. కోట్లు పెట్టి లాభాలు పొందుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేందుకు డబ్బులు లేవు గానీ మూసి నది కోసం రూ.లక్షల కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అంతకుముందు మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు ఆధ్వర్యంలో 150కి పైగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
కేసులు పెడితే ఖబర్దార్..: మాజీ ఎమ్మెల్యే జాజాల
బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెడితే ఖబర్దార్ అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ( Ex Mla Jajala surendhar) హెచ్చరించారు. బీఆర్‌ఎస్ సభకు ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యే మదన్మోహన్ హుకూం జారీ చేశారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నిధుల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేదే లేదు.. : మాజీ జెడ్పీటీసీ తానాజీరావు
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని మాజీ జెడ్పీటీసీ తానాజీరావు అన్నారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారని, తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అమెరికా నుంచి వచ్చిన కిషోర్‌రెడ్డి ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, ముజీబుద్దీన్, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.