అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ADR Report | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ చెత్త రికార్డు మూట గట్టుకున్నారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న సీఎంల జాబితాలో ఆయనే అగ్ర స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి రెండో ప్లేస్‌లో నిలిచారు.
దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై పరిశోధన చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) వెలువడించిన నివేదికలో ఈ అంశం వెలుగు చూసింది. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టయి 30 రోజులకు మించి నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా పదవి నుంచి తొలగించే బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్(Parliament)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నివేదిక చర్చనీయాంశమైంది.
ADR Report | 12 మంది సీఎంలపై కేసులు..
ఏడీఆర్ వెల్లడించిన నివేదిక(ADR Report) ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా సమర్పించే అఫిడివిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ ఈ నివేదికను రూపొందించింది. ముఖ్యమంత్రుల్లో అత్యంత, అత్యల్ప సంపన్నుల జాబితాను ప్రచురించింది. అదే సమయంలో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న సీఎంల జాబితాను కూడా వెల్లడించింది. 89 కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Tamil Nadu CM MK Stalin) రెండో స్థానంలో నిలిచారు. దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై 19 కేసులున్నాయి.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై 13, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై 5, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్‌లపై నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై 2, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఓ కేసు నమోదై ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాప్, అవినీతి వంటి తీవ్రమైన నేరారోపణలున్నాయని పేర్కొంది.
ADR Report | ఎమ్మెల్యేల్లోనూ మనోళ్లే..
దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది (45 శాతం) వివిధ కేసుల్లో ఉన్న వారే. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికంగా ఉండడం గమనార్హం. రాష్ట్రాల వారీగా చూస్తే.. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 79 శాతం మంది ఎమ్మెల్యేలతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 69 శాతం కళంకిత ఎమ్మెల్యేలతో కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ద్వితీయ స్థానంలో నిలిచాయి.